ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచే: బడ్జెట్ తోపాటు కీలక బిల్లులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఏడాదికిగానూ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందే ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2024-25 ఆర్థిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టు సహా పలు కీలకమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

కాగా, ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నాలుగు నెలలకు గాను ఓటాన్ ఏకౌంట్ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత మరో నాలుగు నెలలకు గాను ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌కు అమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో వచ్చే నాలుగు నెలలకు గాను పూర్తి స్థాయిలో 2024- 25 ఏడాదికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
సోమవారం ఉదయం 10 గంటల తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే విధంగా శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ని మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ వాయిదా తర్వాత సభాపతి అధ్యక్షతన బీఎసీ సమావేశం జరగనుంది.
కాగా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. భూముల ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రస్తుత ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 1982 ఇబ్బందిగా ఉందని, దాన్ని రద్దు చేసి కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024ను ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు దేవాలయాల్లోని పాలక మండళ్లలో అదనంగా మరో ఇద్దరు సభ్యులు నియామకంపై బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఇక, గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ కమీషన్ రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. అలాగే జ్యూడిషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 61 ఏళ్ల కు పెంచుతూ చట్ట సవరణ చేయనున్నారు. అయితే, ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications