ఆగమ్మ రోజమ్మా: దూళిపాళ్ల వ్యాఖ్య, జగన్ ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. సభలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పలు అంశాల పైన వాదోపవాదులు జరిగాయి. దూళిపాళ్ల నరేంద్ర ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఒక్క నిమిషం ఆగమ్మ రోజమ్మా అంటూ వ్యాఖ్యానించారు.
ఉచిత విద్యుత్‌పై పెద్దిరెడ్డి నిలదీత
ఉచిత విద్యుత్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సభలో నిలదీశారు. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఎప్పటి నుండి ఇస్తారని ప్రశ్నించారు. దీనికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానం ఇస్తూ.. వ్యవసాయానికి దశలవారీగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ వెంటనే ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. దశల వారీగా ఇస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. విద్యుత్ సంస్థలను ప్రయివేటుపరం చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.
ప్రశ్నోత్తరాల్లో నకిలీ మద్యం అంశం ప్రస్తావన వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఎన్నికల సమయంలో నకిలీ మద్యం పంపిణీ చేశారని, అది వాస్తవం కాదా అని దూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు నకిలీ మద్యం పంపిణీ చేసింది నిజమేనని కొల్లు రవీంద్ర అన్నారు.
దీనిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మండిపడ్డారు. తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నమోదైన ఎక్సైజ్ కేసుల పైన విచారణకు సిద్ధమా అని జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఇది చేతకాని ప్రభుత్వమని, మద్యం కేసుల పైన సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ముందా అని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మద్యం కేసుల పైన విచారణ జరిపిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు.
మహిళల పైన అఘాయిత్యాలు పెరిగిపోయాయని రాజన్న దొర అన్నారు. అధికార పార్టీ సభ్యులు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించడంతో.. వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ మరణించి అయిదేళ్లవుతున్నా ఇంకా ప్రతిదానికి ఆయన పేరును ప్రస్తావించడం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications