మద్యం కంపెనీల ఓనర్ల వివరాలివ్వండి-జగన్ సర్కార్ కు పురందేశ్వరి డిమాండ్..
ఏపీలో మద్యం విక్రయాలు, మద్య నిషేధం, మద్యం అమ్మకాల్లో అక్రమాలు వంటి అంశాలపై పోరు సాగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ప్రభుత్వం ముందు మరో డిమాండ్ పెట్టారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో అక్రమాల నేపథ్యంలో దాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలను ఆమె టార్గెట్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ముందు ఆమె కీలక డిమాండ్ పెట్టారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.
ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మద్యం కంపెనీల వివరాలను బయటపెట్టే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. మద్యం కంపెనీల ఓనర్లు వైసీపీ వాళ్లేనని ఆమె ఆరోపించారు. అందుకే ప్రభుత్వం వీరి వివరాలు బయటపెట్టేందుకు ముందుకు రావడం లేదని పురందేశ్వరి విమర్శించారు.

ఏపీలో మద్యం తయారీ సంస్ధల యజమానుల వివరాలు బయటపెట్టేందుకు పురందేశ్వరి ప్రభుత్వానికి గడువు కూడా పెట్టారు. ఇవాళ సాయంత్రం లోగా మద్యం కంపెనీల యజమానుల వివరాలు బయటపెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని గతంలో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పురందేశ్వరి గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఎన్నికల వేళ మద్యం అంశంపై బీజేపీ వరుసగా టోన్ పెంచుతోంది. ఢిల్లీ మద్యం స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు ఉండటం, మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి కూడా ఉండటంతో బీజేపీ ఆరోపణలకు ప్రాధాన్యం పెరుగుతోంది.












Click it and Unblock the Notifications