వైసీపీ ప్రభుత్వం పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని విమర్శించారు. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ప్రతి కార్యకర్త తనకు సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
బీజేపీ నేతల సమావేశంలో పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారని, అయితే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగులపైనా ఆలోచించాలన్నారు. ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయమే ఉందని, అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని పురందేశ్వరి సూచించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని.. వచ్చిన పరిశ్రమలు ఉండడం లేదని, లూలూ, జాకీ వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో ఇసుక దందా భారీ ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. సుప్రీం కోర్టు కూడా ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించిందన్నారు. ఇసుక మాఫియా వల్ల పేదల జీవితాలు రోడ్డున పడ్డాయని, భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవని, ఇసుక మాఫియాతో నేతలు జేబులు నింపుకోవడమే కాదు.. పేదల జీవితాలు ఛిద్రమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై పోరాడితేనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. కేంద్ర నిధులను పక్క దోవ పట్టిస్తోందని.. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని పురంధేశ్వరి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications