Somu Veerraju పోలీసుల్ని నెట్టేసిన సోము వీర్రాజు-రావులపాలెం దగ్గర కారు అడ్డగింత-ట్రక్కు అడ్డుపెట్టడంపై ఆగ్రహం
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుకు ఇవాళ పోలీసులు షాకిచ్చారు. కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద ఆయన కారును ఇవాళ పోలీసులు అడ్డుకున్నారు. కారుకు అడ్డుగా భారీ కంటెయినర్ ను పెట్టి మరీ నిలిపేశారు. దీంతో పోలీసులకూ, సోము వీర్రాజుకు మధ్య కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఉదయం 10 గంటల సమయంలో రావులపాలెం నుంచి జొన్నాడ జంక్షన్ వైపు వెళ్తున్న సోమువీర్రాజు కారుని పోలీసులు నిలిపేశారు. సోము వీర్రాజు కారుకు ముందు భారీ కంటెయినర్ ను నిలిపారు. దీంతో సోము వీర్రాజు కారు ముందుకు వెళ్లేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో సోము వీర్రాజు కారు దిగి పోలీసుల్ని నిలదీశారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి తాను వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి వారి వద్ద సమాధానం లేదు. పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే అడ్డుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను అడ్డుకుంటున్న పోలీసుల్ని పక్కకు నెట్టేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.

వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారని సోము వీర్రాజు ప్రశ్నించారు. అడుగడుగునా ఆంక్షలతో పోలీసు భద్రత మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారని నిలదీశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని ఉద్రిక్త పరిస్థితులను నిర్మాణం చేయదలచుకోలేదని ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుకని ఆయన అడిగారు. పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు మీ ప్రభుత్వం పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయని సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి రాష్ట్ర పాలన దిగజారిందనే విషయాన్ని మీ చర్యలు అద్దం పడుతున్నాయని సోము ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications