ఏపీలో తిరగబెడుతున్న కరోనా- మూడు జిల్లాలో వెయ్యికి పైగా కేసులు- 24 గంటల్లో 91 మరణాలు
ఏపీలో కరోనా కేసుల ప్రభావం ఈ మధ్య కాస్త తగ్గిందని భావిస్తున్న నేపథ్యంలో తిరిగి మళ్లీ విజృంభణ ప్రారంభమైంది. వరుసగా మూడు రోజులుగా 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటంతో జనంలో ఆ మేరకు భయాలు కూడా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తుండటంతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
ఏపీలో తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో 9544 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు జిల్లాల్లోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరిలో ఎప్పటిలాగే 1300 కేసులు నమోదుకాగా.. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ 1100 చొప్పున కేసులు నమోదయ్యాయి. కృష్ణాజిల్లా ఎప్పటిలాగే అత్యల్పంగా 265
కేసులతో ఈ జాబితాలో చివరి స్ధానంలో నిలిచింది. కృష్ణాజిల్లాకు కనీసం దగ్గర్లో కూడా ఏ జిల్లా లేకపోవడం విశేషం.

అలాగే మరణాల లెక్క చూస్తే గత 24 గంటల్లో 91 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికంగా చిత్తూరులో 16 మంది, పశ్చిమగోదావరిలో 13 మంది, నెల్లూరులో 12, తూర్పుగోదావరిలో 11 మంది చనిపోయారు. అనంతపురంలో 8 మంది, కడపలో ఏడుగురు, విశాఖలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరు, కృష్ణా, కర్నూలో ముగ్గురు చొప్పున చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3092కు చేరింది.
రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.34 లక్షలకు చేరుకోగా... ఇందులో 2.44 లక్షల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 87 వేల మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications