రేపు ఏపీ కేబినెట్ భేటీ- అజెండాలో ఐటీ పాలసీ, జలవివాదాలు సహా కీలక అంశాలివే..
ఏపీలో కరోనా ప్రభావం కాస్త తగ్గుతున్న నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న పలు కీలక అంశాలపై చర్చించేందుకు రేపు కేబినెట్ భేటీ కాబోతోంది. అమరావతి సచివాలయంలో జరిగే ఈ భేటీలో అంతర్ రాష్ట్ర జలవివాదాలతో పాటు జాబ్ క్యాలెండర్ పై విమర్శలు, టిడ్కో ఇళ్ల నిర్మాణంతో పాటు వివిధ అంశాలు అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ విధానంపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది. అలాగే తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో జల వివాదాలు కూడా చర్చకు రానున్నాయి. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ మంత్రుల విమర్శలు, దీనిపై గ్రీన్ ట్రైబ్యునల్ , కృష్ణాబోర్డుల్లో అనుసరించాల్సిన వైఖరిపైనా చర్చిస్తారు.

Recommended Video
రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పురోగతి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ, అమ్మఒడిలో భాగంగా విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధతపైనా చర్చ జరగనుంది. ఈ ఏడాది మిగిలిన సంక్షేమ పథకాల అమలుపైనా కేబినెట్ చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications