ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- అమరావతి ఇళ్ల నుంచి మెడికల్ కౌన్సిల్ ఆర్డినెన్స్ వరకూ..
ఇవాళ అమరావతిలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరికొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్ భేటీలో 55 అంశాలపై చర్చించారు. ఇందులో అమరావతిలో 50 వేల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం చేయిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అసైన్డ్ భూములు, లంక భూములకు సంబంధించి పూర్తి హక్కులు లబ్దిదారులకే కేటాయించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో అసైన్డ్ భూములున్న లబ్ధిదారులు.. భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్ ల్యాండ్స్, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒరిజినల్ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటునకు నిర్ణయిం తీసుకుంది. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. తద్వారా పూర్తి హక్కులు కల్పించనున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో అర్చకులకు రిటైర్‌మెంట్ లేకుండా చేసే చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. టోఫెల్ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

కర్నూల్‌లో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరుచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 18న జగనన్న తోడు నిధుల జమ, 20న సీఆర్‌డీఏ, ఆర్5 జోన్‌లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం, 21న నేతన్న నేస్తం నిధుల జమ, 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ, 28న జగన్న విదేశీ విద్యా పథకం ఉన్నాయి.












Click it and Unblock the Notifications