APSRTC: ప్రైవేటీకరణపై తేల్చేసిన ఆర్టీసీ- పీపీపీ లీజులపై క్లారిటీ..!
ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)లో విద్యుత్ బస్సుల కొనుగోలు, డిపోల లీజు వంటి నిర్ణయాల నేపథ్యంలో ప్రైవేటీకరణ చర్చ ముమ్మరంగా సాగుతోంది. దీంతో ఉద్యోగ సంఘాలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఇవాళ ప్రైవేటీకరణపై నెలకొన్న ఆందోళనలపై స్పష్టత ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆర్టీసీ లీజులతో పాటు పలు అంశాల్ని ప్రస్తావించారు. ఉద్యోగులకు దీనిపై ఆందోళనలు అవసరం లేదన్నారు.
ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను వాణిజ్య ఆదాయం సమకూర్చుకునే ఉద్దేశంతో పారదర్శకమైన ఓపెన్ టెండర్ విధానంలో మాత్రమే ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. . ప్రాజెక్టుల స్వభావాన్ని బట్టి లీజు కాలపరిమితి 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, రిటైల్ ఆయిల్ అవుట్‌లెట్ల విషయంలో 20 సంవత్సరాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో బీవోటీ ప్రాతిపదికన 33/49 సంవత్సరాల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ స్థలాలను బీవోటీ ప్రాతిపదికన పీపీపీ విధానంలో లీజుకు ఇవ్వడం 2005 సంవత్సరం నుండి అమలులో ఉందని గుర్తుచేశారు. సంస్థ ఆర్థిక వనరులను పెంపొందించేందుకు చేపడుతున్న నిరంతర వాణిజ్య అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కేటాయింపులు కాలానుగుణంగా చేపడుతున్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లలో ఆర్టీసీక చెందిన సుమారు 24.86 ఎకరాల స్థలాలను 29 ప్రాజెక్టులకు బీవోటీ ప్రాతిపదికన లీజుకు కేటాయించినట్లు తెలిపారు.

ప్రస్తుతం తిరుపతి బస్ టెర్మినస్ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ఈ ప్రాజెక్టుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని ప్రత్యేక సంస్థ అయిన నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML) సాంకేతిక సహకారం అందిస్తోందన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆధునిక బస్ టెర్మినస్‌ను ప్రయాణికులకు అందించడంతో పాటు పీపీపీవిధానంలో స్థిరమైన వాణిజ్య ఆదాయం పొందడం లక్ష్యంగా ఉందన్నారు. దీన్ని ఓపెన్ టెండర్ ద్వారా పారదర్శకంగా స్థల కేటాయింపునకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇది మినహా ఆర్టీసీకి చెందిన మిగతా ఖాళీ స్థలాలను పీపీపీ విధానంలో కేటాయించడం లేదా అభివృద్ధి చేయడానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పరిశీలనలో లేవన్నారు. భవిష్యత్తులో ఏవైనా ప్రతిపాదనలు వస్తే వాటిని పూర్తిగా ఓపెన్ టెండర్ విధానంలోనే చేపడతామన్నారు.

దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం అమలు చేస్తున్న PM e-Bus Sewa Scheme కింద అన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సబ్సిడీలను వినియోగించుకుంటూ అత్యాధునిక బస్ డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తున్నాయని, ఈ పథకానికి అనుగుణంగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, నిర్వహణ కోసం అవసరమైన స్థలాలను గుర్తించి, మిగిలిన ఖాళీ స్థలాలను పీపీపీ ప్రాతిపదికన దీర్ఘకాలిక లీజుకు కేటాయించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఊహాగానాలు, వాస్తవాలకు అనుగుణంగా లేని ఆధారరహిత వార్తల పట్ల ప్రజలు, ప్రయాణికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఏపీ పీటీడీ సంఘాలు, ఇతర సంబంధిత వర్గాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.














Click it and Unblock the Notifications