Visakhapatnam: విశాఖ టూ షాలిమార్, బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
వేసవి సెలవులు ముగిశాయి. ఊళ్లకు వెళ్లిన వారంతా తిరుగుముఖం పడుతున్నారు. దీంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే విశాఖ (Visakhapatnam) నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి షాలిమార్, విశాఖ నుంచి బెంగళూరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటికి సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను కూడా అధికారులు ఇవాళ వెల్లడించారు.
విశాఖపట్నం నుంచి షాలిమార్ కు ప్రతీ మంగళవారం ఉదయం 11.20కు ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు (08508) జూలై 7 నుంచి సెప్టెంబర్ 29 వరకూ నడపబోతున్నారు. ఈ రైలు షాలిమార్ కు మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంటుంది. అలాగే షాలిమార్ నుంచి విశాఖకు మరో ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు (08507) ప్రతీ బుధవారం ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది. ఇది విశాఖకు అదే రోజు రాత్రి 8.50కు చేరుకుంటుంది. ఈ రైలు జూలై 8 నుంచి సెప్టెంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లకు సింహాచలం, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాసలో స్టాప్ లు ఇచ్చారు.

అలాగే విశాఖ నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరుకు ప్రత్యేక రైలు (08581)ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3.20కి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1.50కి బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు జూలై 3 నుంచి సెప్టెంబర్ 25 వరకూ అందుబాటులో ఉంటుంది. అలాగే బెంగళూరు నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు (08582) ప్రతీ శనివారం మధ్యాహ్నం 3.50కు బయలుదేరుతుంది. ఇది విశాఖకు మరుసటి రోజు మధ్యాహ్నం 1.30కు చేరుకుంటుంది. ఈ రైళ్లకు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో స్టాప్ లు ఇచ్చారు.












Click it and Unblock the Notifications