వాహన మిత్ర రూ15 వేలు జమ పై ప్రభుత్వం తాజా నిర్ణయం, ముహూర్తం..!!
ఏపీలో వాహనమిత్ర పథకం అమలు పై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దసరాకు ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ రోజు జరగనున్న మంత్రివర్గ భేటీలో పథకం అమలు.. విధి విధానాల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అర్హతలను ఖరారు చేసిన ప్రభుత్వం అధికారులకు సూచనలు చేసింది. అర్హుల జాబితా పరిశీలన మొదలైంది. కాగా.. ఈ పథకం ద్వారా అర్హులైన వారి ఖాతాల్లో రూ 15 వేలు జమ చేసేందుకు ముహూర్తం సైతం ప్రభుత్వం ఖరారు చేసింది.
ఏపీ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది. ఆగస్టు 31 లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్‌డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనుమతులు లేకపోయినా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ విధించే ప్రతిపాదనపై నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే విధంగ నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టు ల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్-2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. వాహన మిత్ర పథకం కింద ఈ దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి 15 వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలపనున్నారు.
వాహన మిత్ర కింద దరఖాస్తు చేసుకునే వాహనదారులు... ఆటో, క్యాబ్ కలిగి ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు. ఆటో, క్యాబ్ కాకుండా ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు. దరఖాస్తుదారు ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 24న తుది జాబితా సిద్ధం చేయనున్నట్టుగా తెలిపింది. అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లలో అక్టోబరు 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జమ చేయనున్నారు.












Click it and Unblock the Notifications