ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అజెండాలో
AP Cabinet meeting: ఏపీ మంత్రివర్గం నేడు సమావేశం కాబోతోంది. ఈ ఉదయం వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా, కేబినెట్ మంత్రులు ఇందులో పాల్గొంటారు.
పెట్టుబడుల పోత్సాహాక మండలి అందజేసిన పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల విలువ 28,546 కోట్ల రూపాయలు. రాష్ట్రం భారీ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. వీటిని ఇదివరకే ఎస్ఐపీబీ ఆమోదించింది. మంత్రివర్గం.. తుది ఆమోదం తెలపాల్సి ఉంది.

విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. కాగ్నిజెంట్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మలి విడత చేపట్టదలిచిన ల్యాండ్ పూలింగ్.. వంటివి మంత్రివర్గం ముందుకు చర్చకు రానున్నాయి.
అమరావతి భవన సముదాయాల నిర్మాణంపై గతంలో సీఆర్డీఏ ఆమోదించిన ప్రతిపాదనలకూ ఈ సందర్బంగా మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. మొత్తంగా 45, 249 కోట్ల పనులకు గతంలో సీఆర్డీఏ అనుమతులు ఇచ్చింది గతంలో. ఇందులో- అసెంబ్లీ భవనానికి రూ. 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1,048 కోట్లు, అయిదు ఐకానిక్ టవర్లకు 4,665 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ వెల్లడించింది.
అలాగే రహదారుల టెండర్ల కోసం మరో రూ.9,699 కోట్లు, ఇతర రోడ్లకు 7, 794 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారని సమాచారం. ఈ నిధుల్లో 15,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తీసుకోనుంది. మిగిలిన మొత్తాన్ని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కోల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications