నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి చంద్రబాబు ఝలక్-సీఎస్ కీలక ఆదేశాలు..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవుల్లో నియమించిన వారందరికీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఝలక్ ఇచ్చారు. వారిని వెంటనే సాగనంపాలని సీఎస్ కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయన ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఇంకా కొనసాగుతున్న వారిని తప్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, డైరెక్టర్లను వెంటనే తప్పుకోనేలా చూడాలని వివిధ శాఖల కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పలు శాఖల కింద పనిచేస్తున్న కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు స్వచ్చందంగానే తప్పుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇంకా తప్పుకోకుండా వేచి చూస్తున్నారు. ఇలాంటి వారందరినీ ఇప్పుడు ప్రభుత్వం తప్పించబోతోంది.

అయితే రాజ్యాంగ సంస్థలైన వక్ఫ్ బోర్డు, ఏపీపీఎస్సీ వంటి వాటిని మినహాయించి మిగిలిన కార్పోరేషన్లు, బోర్డుల్లో కొనసాగుతున్న నామినేటెడ్ పోస్టుల వ్యక్తుల్ని సీఎస్ ఆదేశాల మేరకు తప్పించబోతున్నారు. దీంతో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఆయా పోస్టుల్లో కొత్త వ్యక్తుల్ని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలే ఈసారి కూటమి ప్రభుత్వం కాబట్టి మూడు పార్టీలకు చెందిన వారిని ఈ పోస్టుల్లో నియమించాల్సిన పరిస్ధితి. దీంతో ప్రస్తుతం ఉన్న వారిని వెంటనే తప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications