Ramoji Rao : 5 గంటలు- 46 ప్రశ్నలు- రామోజీరావుపై సీఐడీ విచారణ సాగిందిలా..
ఏపీలో మార్గదర్శ చిట్స్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేసిన సీఐడీ.. తాజాగా రామోజీ గ్రూపు సంస్ధల అధినేత చెరుకూరి రామోజీరావును హైదరాబాద్ లో విచారించింది. ఇందులో మార్గదర్శి అక్రమాలకు సంబంధించి సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
మార్గదర్శి అక్రమాల కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని రామోజీరావుకు సీఐడీ గత వారమే నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు కూడా ఇదే విధంగా నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన వీరు సీఐడీ విచారణకు అందుబాటులో ఉండే తేదీల్ని వెల్లడించారు. దీంతో హైదరాబాద్ లో తన కుమారుడు కిరణ్ నివాసంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామోజీరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును సీఐడీ అధికారులు మార్గదర్శి కేసులో ఐదు గంటల పాటు 46 ప్రశ్నలు సంధించారు. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ నేతృత్వంలోని 23 సభ్యుల బృందం జూబ్లీహిల్స్ లోని ఇంటికి వెళ్లి ఆయన్ను విచారించింది. ఉదయం 11.30కు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం అలసటగా ఉందని రామోజీరావు చెప్పడంతో మధ్యలో ఆగింది. తిరిగి డాక్టర్లు ఆయన్ను పరీక్షించిన తర్వాత 2.30 గంటలకు మళ్లీ మొదలైంది. సాయంత్రం ఐదున్నర వరకూ ఈ విచారణ సాగింది.
సీఐడీ విచారణలో రామోజీరావు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామోజీరావు వాంగ్మూలం నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు అవసరమైతే మళ్లీ వస్తామన్నారు. అయితే ఎలాంటి సమాచారం కావాలన్నా రాతపూర్వకంగా తెలియజేస్తే పంపిస్తానని రామోజీరావు వారికి తెలిపారు. మరోవైపు బెడ్ పై పడుకున్న రామోజీరావు అక్కడి నుంచే అధికారులకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రామోజీ బెడ్ పై పడుకున్న ఫొటో తీసుకున్న సీఐడీ అధికారులు దాన్ని ఆ తర్వాత మీడియాకు లీక్ చేశారు. దీనిపై మార్గదర్శి సిబ్బంది ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications