బీజేపీ తోకపార్టీగా టీడీపీ: దమ్మున్న మగాడు జగన్: పీకే పవన్ కల్యాణ్: కొడాలి నాని మార్క్ ఫైర్
అమరావతి: ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్నును తగ్గించకపోవడం పట్ల రాజకీయ రచ్చ సాగుతోంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఆందోళనకు దిగాయి. ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద ధర్నా కార్యక్రమాలను నిర్వహించనుంది.

వైసీపీ నేతల ఎదురుదాడి..
దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఎదురుదాడి మొదలైంది. కౌంటర్లు పడుతున్నాయి. పెట్రోల్ బంకులు ప్రైవేట్ ఆస్తులని, వాటి వద్ద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ఆందోళనలకు పిలుపునిచ్చి టీడీపీ నాయకులు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలచుకున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిలదీశారు. ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడానికి టీడీపీ నాయకులు కుట్ర పన్నారని ఆరోపించారు. దీనిద్వారా రాష్ట్రంలో అశాంతియుత వాతావరణానికి తెర తీయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ పంచన చేరడానికి..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, కుతంత్రాల మయమేనని ధ్వజమెత్తారు. బస్సులను తగులబెట్టడం, పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. బీజేపీ పంచన చేరడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఈ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు బీజేపీ కేంద్ర నాయకుల దృష్టిలో పడటానికి కష్టపడుతున్నాడని చెప్పారు.

మూడున్నర లక్షల కోట్లు పెంపు..
బీజేపీ నాయకుల మీదా కొడాలి నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను 110 నుంచి 115 రూపాయలకు పెంచిన ఘనత బీజేపీ నాయకులకు ఉందని అన్నారు. మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనపు భారాన్ని జనంపై మోపిన కేంద్ర బీజేపీ నాయకులు తగ్గించింది మాత్రం నామమాత్రమేనని అన్నారు. 19 వేల కోట్ల రూపాయలను తగ్గించారని, దాన్ని గొప్పగా చెప్పుకొంటున్నారని ధ్వజమెత్తారు.

పిల్లి బీజేపీ..గల్లీ బీజేపీ..
వారికి తగ్గట్టుగా ఏపీ బీజేపీ నాయకులు తయారయ్యారని కొడాలి నాని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ రేట్లను 115 రూపాయలకు పెంచినప్పుడు వీళ్లంతా ఏమయ్యారని నిలదీశారు. ఏపీలో డిపాజిట్లు కూడా రాని బీజేపీ నాయకులు- తమ ప్రభుత్వాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడటం సరికాదని చెప్పారు. దేశాన్ని ఏలుతున్నామని చెప్పుకొంటున్న బీజేపీకి.. ఏపీలో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఉందని అన్నారు. బద్వేలులో టీడీపీ, జనసేనలను కలుపుకొని ఎన్నికలకు వెళ్లినా దిక్కు లేదని విమర్శించారు. బీజేపీని దేవుడు కూడా కాపాడలేడని చెప్పారు.

టీడీపీని తగులబెట్టారు..
బీజేపీతో కొద్దిరోజులు, కాంగ్రెస్‌తో ఇంకొన్ని రోజులు అంటకాగి.. అధికారంలోకి రావడానికి కుట్రలు చేసిన తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడిని 2019 నాటి ఎన్నికల సందర్భంగా ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారని కొడాలి నాని అన్నారు. ఆ తరువాత జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీని తరిమి కొట్టారని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలోనూ టీడీపీని, చంద్రబాబును తగులబెట్టడానికి ఆయన సొంత నియోజకవర్గం ఓటర్లు సిద్ధంగా ఉన్నారని కొడాలి నాని అన్నారు. ఓటు వేయనందుకు ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచేలా చంద్రబాబు కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పీకే పవన్ కల్యాణ్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా కొడాలి నాని నిప్పలు చెరిగారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాలు ఉద్యమకారులను సైతం దిగ్భ్రాంతికి గురి చేశాయని చెప్పారు. వారం రోజుల్లో అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపించాలని డెడ్‌లైన్ పెట్టాడని గుర్తు చేశారు. జనసేన, బీజేపీల నుంచి నాయకులను పంపిస్తే తానే ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాల్సింది బీజేపీయేనని, ఆ పార్టీకి వంత పాడుతున్న పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డెడ్‌లైన్ ఎందుకు పెట్టాడని నిలదీశారు.

చంద్రబాబు ఏనాడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశాడా?
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, జంఝావతి ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించుకోవడానికి, కొఠియా గ్రామాల సరిహద్దు అంశాన్ని నిర్ధారించడానికి వైఎస్ జగన్.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలవడానికి వెళ్లారని కొడాలి నాని చెప్పారు. ఈ రకంగా చంద్రబాబు తన 14 సంవత్సరాల హయాంలో ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారా అని ప్రశ్నించారు.

చక్రం తిప్పుతున్నానని చెప్పుకోవడానికే తప్ప..
రాజకీయాల కోసం, చక్రం తిప్పుతున్నానని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రులను కలిశాడే తప్ప.. సమస్యలను పరిష్కరించడానికి సమావేశం అయ్యారా? అని నిలదీశారు. తన రాజకీయ అవసరాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ..ఇలా ప్రతి ఒక్క పార్టీ నాయకుడినీ కలిశాడని, వెన్నెముక లేని నేత చంద్రబాబేనని కొడాలి నాని మండిపడ్డారు. నిలువెల్లా కుట్రలు, కుతంత్రాలతో బతుకుతున్న చంద్రబాబును అల్లుడిని చేసుకున్నందుకు ఎన్టీ రామారావు చాలా సార్లు బాధపడ్డారని చెప్పారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు..
పెట్రోల్, డీజిల్ రూపంలో పేద ప్రజల మీద విధించిన మూడున్నర లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయట్లేదని కొడాలి నాని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం నిధులను మంజూరు చేస్తోందని, మిగిలిన రాష్ట్రాల నుంచి లాక్కోవడమే తప్ప ఇవ్వడం తెలియట్లేదని అన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో బీజేపీ ఎదురుగాలి వీచిందని, అందుకే ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని చెప్పారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications