ప్రధాని మోడీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ: కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన బిజిబిజీగా సాగుతోంది. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో ఏపీ సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఆయా నిధుల మంజూరుపై ప్రధానితో మాట్లాడినట్లు సమాచారం.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనా ప్రధానితో మాట్లాడినట్లు తెలిసింది. దీంతోపాటు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరినట్లు సమాచారం.

రధానితో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం సమావేశమవుతారు. సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు.
మరోవైపు, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఏపీలో విమానయానరంగ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటు, వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర పౌరవిమానయానశాఖ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications