హ్యాప్పీ బర్త్ డే సీఎం సార్.. చంద్రబాబు 76 ఏళ్ల జీవితంలో ఆ "రెండు" ఘటనలే !!
నేడు ఏప్రిల్ 20, 2026.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం. ఈ వయసులోనూ.. అలుపెరగని యోధుడిలా.. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తూ దూసుకుపోతున్నారు. అందుకే ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. 40 ఏళ్లకు పైగా ఉన్న తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా కానీ.. అన్నింటినీ తనదైన శైలిలో ఎదుర్కొని విజనరీ లీడర్‌గా ఎదిగారు. ఈ సమయంలోనే ఆయన జీవితంలో పీడకల లాగా మిగిలిన రెండు ముఖ్య ఘటనలను గుర్తు చేసుకుందాం.
పొలిటికల్ కెరీర్..
చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా 1983లో దివంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో చేరారు. 1995 లో మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక సామాన్య కాంగ్రెస్ నాయకుడి నుంచి తెలుగుదేశం పార్టీ రథసారథిగా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.

అంతే కాకుండా రాజకీయాలంటే పూలబాటే కాదు.. ముళ్లబాటలు కూడా ఉంటాయని.. కానీ వాటిలోనూ పయనించి విజయం సాధించవచ్చని నిరూపించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓటమి చెందడం ఒక ఎత్తైతే.. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పార్టీ పరిమితం అయిపోవడం ఊహించని షాక్ అనే చెప్పాలి. కానీ ఆ స్థాయి నుంచి కూడా 2024 ఎన్నికల్లో తిరిగి 135 సీట్లు కైవసం చేసుకొని రికార్డులు తిరగరాసిన ఘనత ఆయనకే చెల్లింది. కానీ ఆయన జీవితంలో కూడా మర్చిపోలేని కొన్ని ఘటనలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన రెండు ఘటనలు ఏవంటే ??
ఆ రెండు ఘటనలే..
అలిపిరి వద్ద పెను ప్రమాదం :
అక్టోబర్ 1, 2003న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తుండగా తిరుపతిలోని అలిపిరి వద్ద పెను ప్రమాదం జరిగింది. నక్సలైట్లు (పీపుల్స్ వార్ గ్రూప్) రోడ్డు పక్కన అమర్చిన తొమ్మిది క్లేమోర్ మైన్లను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చారు. ఈ శక్తివంతమైన పేలుడులో చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు గాలిలోకి ఎగిరి పడింది. అదృష్టవశాత్తూ ఆయన స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు, కానీ ఆయనతో పాటు ఉన్న పలువురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ :
సెప్టెంబర్ 9, 2023న తెల్లవారుజామున నంద్యాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. కార్పొరేషన్ నిధులలో సుమారు రూ. 371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, అందులో ఆయన కీలక పాత్ర పోషించారని ఏపీ-సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో, చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపారు. అనంతరం, అనారోగ్య కారణాల దృష్ట్యా అక్టోబర్ 2023లో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది, ఆ తర్వాత నవంబర్‌లో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ చట్టపరమైన విచారణ తర్వాత, ఫిబ్రవరి 2026లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనితో ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణలు తొలగిపోయాయి.












Click it and Unblock the Notifications