రేపు అమరావతికి చంద్రబాబు - రాజధాని ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు..?
ఏపీలో గత వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి రాజధానిలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత ఇక్కడ వేగంగా పలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అయితే ప్రభుత్వ మార్పతో అవన్నీ నిలిచిపోయాయి. ఆ తర్వాత వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని తెరపైకి తీసుకురావడంతో అమరావతి పూర్తిగా కళ తప్పింది. ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్ధితిని చంద్రబాబు పరిశీలించబోతున్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మున్సిపల్ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో కలిసి చంద్రబాబు అమరావతి రాజధానిలో నిర్మాణాలను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను చంద్రబాబు పరిశీలిస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

రేపు ఉదయం సీఎం చంద్రబాబు తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు అమరావతి పర్యటనకు బయలుదేరుతారు. ఉండవల్లిలో గత వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభిస్తారు. తర్వాత ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలిస్తారు.
ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్ లను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీకి ముందే అమరావతిలో పర్యటించడం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందను చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications