Women's Day: మహిళా ఉద్యోగులకు చంద్రబాబు కానుక..!
ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తామని ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం టూర్ లో చంద్రబాబు మరో ప్రకటన చేశారు. మహిళా దినోత్సవ కానుకగా మహిళలకు పలు వరాలు ప్రకటించారు.
జనాభా సమతుల్యత గురించి సీఎం చంద్రబాబు కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేశం వృద్దాప్య సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే యువశక్తితో భారత్ ముందుకు వెళ్లాలంటే కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండాలని చంద్రబాబు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనండి అని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. పిల్లల్ని కనకపోవడం వల్ల, మితిమీరిన జనాభా నియంత్రణ వల్ల పాశ్చాత్య దేశాల్లో ఎదురుతున్న సమస్యలను ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేశారు. పిల్లల్ని కనిపెంచే విధానాలను ప్రోత్సహించాలని ఈ రోజు మరో కీలక నిర్ణయం ప్రకటించారు. సాధారణంగా ప్రతి మహిళా ప్రభుత్వ ఉద్యోగినికి రెండు కాన్పులకు ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇస్తుంది. ఆరు నెలల చొప్పున జీతంతో కూడిన ఈ సెలవులు వారికి ఉంటాయి.
ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెపుతున్న సీఎం చంద్రబాబు..దాన్ని ప్రోత్సహించేందుకు ఇకపై ఎంత మంది పిల్లల్ని కన్నా..అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు ఇస్తామని ఇవాళ ప్రకటించారు. ఇది అమల్లోకి వస్తే.... ఎన్ని కాన్పులు జరిగినా అన్నింటికీ ఆ ఉద్యోగినికి ప్రసూతి సెలవులు లభిస్తాయి. మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన ప్రకటనపై మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.












Click it and Unblock the Notifications