ఏపీ మరో రాజధానిగా, టాప్ మనమే -అగ్రి విద్యార్థులకు కండిషన్ -సమీక్షలో జగన్ -సీఎంతో నీతి ఆయోగ్ టీమ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ సర్కారు మరో ఘనత సాధించింది. ఉద్యాన పంటల్లో గరిష్ట సాగుతో ఆంధ్రప్రదేశ్ దేశానికే రాజధానిగా, ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా నిలిచింది. ఈ విషయాన్ని అధికారులు సీఎంకు తెలిపారు. హార్టికల్చర్,సెరికల్చర్,వ్యవసాయ అనుబంధశాఖలపై శుక్రవారం సమీక్ష నిర్వహించిన సీఎం అగ్రికల్చర్ విద్యార్థులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, నీతి ఆయోగ్ సభ్యుల టీమ్ ఇవాళ ముఖ్యమంత్రిని కలిసింది. పూర్తి వివరాలివి..

రైతుల ఆదాయాన్ని పెంచేలా..
సీఎం జగన్ శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసులో హార్టికల్చర్,సెరికల్చర్,వ్యవసాయ అనుబంధశాఖలపై సమీక్షలో మాట్లాడుతూ, ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలని, నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలని, ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూలమైన రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలని నిర్దేశించారు.

ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ
ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ఏపీ ప్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై సీఎంకు వివరాలందించారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిల్చిందని అధికారులు తెలిపారు. మిరప పంట విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. టిష్యూ కల్చర్ విధానంలో అరటిసాగు చేపడుతున్నామన్నారు. పుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులు మొదలు కావాలని సీఎం జగన్ అదేశించారు. అక్టోబరు నుంచి దశలవారీగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 'కర్నూలు జిల్లాలో మంచి మార్కెట్ అవకాశాలున్న ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి. నాణ్యమైన మంచి రకం ఉల్లి సాగయ్యేలా చూడండి. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉన్న వెరైటీలు సాగయ్యేలా చూడాలి. టమోటను రోడ్డుమీద వేయడం, ధరలేక పొలంలోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే పరిస్ధితి కనిపించకూడదు. దీనికోసం సరైన పరిష్కారాలను చూపాలి'' అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

కొబ్బరికి మంచి ధర వచ్చేలా చూడాలి
ఏపీలో పండించే కొబ్బరికి కూడా మంచి ధర వచ్చేలా చూడాలని.. కొబ్బరిమీద నిరంతరం పరిశోధనలు చేయాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీని సీఎం జగన్ ఆదేశించారు. కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యల మీద నిరంతరం పరిశోధనలు కొనసాగాలని.. అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహకారం, సమాచార మార్పిడి నిరంతరం కొనసాగాలని తెలిపారు. దీనివల్ల మంచి వంగడాలను పెట్టడంతోపాటు సాగులో వస్తున్న సమస్యలకు మంచి పరిష్కారాలు లభిస్తాయన్నారు. వీటితోపాటు ప్రాసెసింగ్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపైనా ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరగాలన్న సీఎం.. వీటికి అనుగుణంగా సాగులో మార్పులు, అనుకూలమైన వంగడాలను సాగుచేసేలా తగిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.

అగ్రి విద్యార్థులకు కండిషన్..
''రైతుభరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేసేలా వ్యవస్థ ఉండాలి. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలి. దీనివల్ల రైతులకు, అగ్రికల్చర్ అసిస్టెంట్‌లకు మధ్య మంచి వాతావరణం ఉంటుంది.. అనుకున్న ఫలితాలను సాధించగలుగుతాము. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలి. అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలి. దీనివల్ల వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం వస్తాయని'' సీఎం జగన్ తెలిపారు. ''తుంపరసేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉండాలి. రివర్స్ టెండరింగ్‌కు వెల్లడం ద్వారా కూడా రేట్లు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన పరికరాలు మంచి రేట్లకు ప్రభుత్వానికి, రైతులకు అందుబాటులోకి వస్తాయి. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలి'' అన్నారు సీఎం జగన్. సెరికల్చర్ సాగుకు కూడా ప్రోత్సాహం అందించాలని సీఎం సూచించారు.
Recommended Video

సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ టీమ్
దేశంలో పరిపాలనా విధానలు, కేంద్రం పని తీరును నిర్దేశించే అత్యున్నత థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ కు చెందిన టీమ్ ఒకటి శుక్రవారం నాడు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయింది. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్ 2020-21 రిపోర్టును వారు సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ సమగ్రాభివృద్దికి వైసీపీ సర్కారు చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యతను నీతి ఆయోగ్ సభ్యులకు సీఎం వివరించారు. అంతకముందు, నీతిఆయోగ్ ఆధ్వర్యంలో సచివాలయంలో సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీస్) ఇండియా ఇండెక్స్ 2020-21, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ)పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్ 62వ స్థానంలో ఉందని నీతి ఆయోగ్ సలహాదారు వెల్లడించారు. మానవాభివృద్ధి సూచికలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ 3వ స్థానంలో ఉందని.. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ఏపీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు స్పష్టం చేసింది. ఎస్‌డీజీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రాన్ని మొదటి స్ధానంలో నిలిపేందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం సుస్ధిరాభివృద్ది లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించుకునేందుకు కృషి చేస్తుందని సీఎంతో జరిగిన చర్చలో చర్చలో అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ సలహాదారు శాన్యుక్తా సమద్దార్, నీతిఆయోగ్ ఎస్‌డీజీ ఆఫీసర్ అలెన్ జాన్, నీతిఆయోగ్ డేటా ఎనలటిక్స్ ఆఫీసర్ సౌరవ్ దాస్, ఏపీ ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications