వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టివేతపై పెదవి విప్పిన రఘురామ: ఇక ఆ పని చేస్తానంటూ
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా వార్తల్లో ఉంటూ వచ్చిన అంశం- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ వ్యవహారం. తిరుగుబాటు నేతగా గుర్తింపు పొందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటీషన్ రాష్ట్రంలో రాజకీయంగా పలు ప్రకంపనలను సృష్టించింది. అనేక రకాల చర్చలకు కారణమైంది. డిబేట్లకూ దారి తీసింది.

పిటీషన్ కొట్టివేత..
ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు- వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బెయిల్ రద్దు కావడానికే అవకాశాలు ఉన్నాయంటూ అంచనా వేస్తూ వచ్చారు. వారి అంచనాలన్నీ తప్పాయి. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి పారేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వెలువడింది.

ఉన్నత స్థానాల్లో ఉన్నందున..
ఆస్తుల కేసులో ఇదివరకు వైఎస్ జగన్ విచారణను ఎదుర్కొన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం వల్ల ఆస్తుల కేసులో సాక్ష్యులను వైఎస్ జగన్ ప్రభావితం చేస్తారనే అనుమానాలను రఘురామ కృష్ణంరాజు వ్యక్తం చేశారు. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వీ విజయసాయి రెడ్డి- రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్నందున సాక్ష్యలను భయభ్రాంతులకు గురి చేస్తారనీ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

రఘురామ అనుమానాలతో ఏకీభవించని న్యాయమూర్తులు..
ఇదివరకు పలుమార్లు సీబీఐ న్యాయస్థానం- ఈ కేసుపై విచారణలను నిర్వహించింది. ప్రభుత్వానికి కౌంటర్‌ను దాఖలు చేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ ప్రక్రియ అంతా ముగించిన సీబీఐ న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే తుది తీర్పును వినిపించింది. సాక్ష్యులను ప్రభావితం చేస్తారంటూ రఘురామ కృష్ణంరాజు వ్యక్తం చేసిన అనుమానాలు, వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. అలాంటి సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది.
స్పందించిన రఘురామ..
సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటీషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసిందని అన్నారు. దీనిపై తాను అప్పీల్ చేస్తానని చెప్పారు. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పర్ కోర్టుకు అప్పీల్ చేస్తానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే చేపడతానని స్పష్టం చేశారు. ఎగువ న్యాయస్థానంలో మరో పిటీషన్‌ను దాఖలు చేస్తానని పేర్కొన్నారు.

వైసీపీ నేతల్లో హర్షాతిరేకాలు..
సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బందుల పాలు చేయడానికే రఘురామ కృష్ణంరాజు ఈ పిటీషన్‌ను దాఖలు చేశారని ఆరోపిస్తోన్నారు. రాజకీయ దురుద్దేశంతో తప్ప మరో కారణం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. చివరికి న్యాయమే గెలిచిందని వైసీపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు. తన సొంత ప్రయోజనాల కోసమే రఘురామ పార్టీకి ఎదురు తిరిగారని, తెలుగుదేశం పార్టీ ఆయనను పురిగొల్పిందని చెబుతున్నారు.

కోర్టు బదలాయింపుపైనా అదే తీర్పు..
సీబీఐ కోర్టులో ఇచ్చే తీర్పుపై తనకు విశ్వాసం లేదని, ఆ పిటీషన్‌ను మరో న్యాయస్థానానికి బదలాయించాలంటూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా కొట్టివేతకు గురైన విషయం తెలిసిందే. మీడియాలో వెలువడిన సమాచారంతో తీర్పు ప్రభావితం అవుతుందంటూ రఘురామ కారణాన్ని చూపారు. తీర్పు నిష్పాక్షికంగా వెలువడాలంటే కేసును మరో బెంచ్‌కు బదలాయించాలని రఘురామ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది.












Click it and Unblock the Notifications