ముస్లిం ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ-పలు కీలక హామీలు- ఆ వెంటనే ఆదేశాలు..
రాష్ట్రంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు సీఎం జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో వారి ప్రతినిధులతో భేటీ అయ్యారు.
అమరావతి : రాష్ట్రంలో ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ భేటీ అయ్యారు. ముస్లింలకు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లుగా పెద్ద ఎత్తున అవకాశం కల్పించామని జగన్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ముస్లిం సంఘాల ప్రతినిధులతో ఇవాళ సమావేశమైన సీఎం జగన్ కు వారు తమ సమస్యలను తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చిన ముస్లిం సంఘాల ప్రతినిధులు.. వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను విన్నవించారు.ముస్లిం సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.

కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌హౌస్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఏం జగన్ ఈ సందర్భంగా అదేశించారు. విజయవాడలోనూ హజ్‌హౌస్ నిర్మాణం చేపట్టాలని ముస్లిం సంఘాలు కోరగా.. హజ్‌హౌస్ నిర్మాణం కోసం అవసరమైన భూమి కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు సీఎం హామీ ఇచ్చారు. అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్ధాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. జిల్లా స్ధాయిలో ఈ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి... జిల్లాస్ధాయిలో ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఖాజీల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ణయించిందని సీఎం దృష్టికి ముస్లిం సంఘాల పెద్దలు తీసుకొచ్చారు. దీంతో ఖాజీల రెన్యువల్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని నివేదించారు. ఖాజీల పదవీకాలాన్ని పెంచడంతో పాటు రెన్యూవల్ ప్రాసెస్‌ను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచడానికి సీఎం ఆదేశాలు ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో సులభతరమైన రెన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారుల్ని ఆదేశించారు.

మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలనిఅధికారులకు సీఎం ఆదేశించారు. ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలన్నారు. సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తి, కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం ఆమోదించారు.
ఈ ప్రభుత్వం మీ సహాయసహకారాలతోనే ఏర్పడిందని, ఇది మనందరి ప్రభుత్వం అన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలని జగన్ ముస్లిం సంఘాల ప్రతినిధుల్ని కోరారు. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ పిలిచామన్నారు. మీరు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తామన్నారు.మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులను కూడా కేటాయిస్తామన్నారు. అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుందన్నారు. ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తాం. ప్రతి ఇంటికి, ప్రతి గడపకూ మంచి చేశాం. దేవుడి దయతో ఇదంతా చేయగలిగామన్నారు.












Click it and Unblock the Notifications