త్వరలో ఢిల్లీకి వైఎస్ జగన్: అజెండా ఇదే: 45..ఆ ప్యాకేజీ కోసం పట్టు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో ఆయన హస్తిన పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తోన్నారు. అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే వైఎస్ జగన్.. ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

మోడీతో పాటు..
ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా ఆయన కలుసుకోనున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్యాకేజీ, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయానికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి వివరించడం, నిధులను రాబట్టుకోవడం వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉండబోతోన్నాయి.

గోదావరి వరద లెక్కలు సిద్ధం..
మొన్నటికి మొన్న గోదావరి వరద పోటుకు గురైన ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. పోలవరం ముంపు గ్రామాలను సందర్శించారు. నిర్వాసితులతో ముఖాముఖిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. వాటన్నింటినీ ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు వివరించనున్నారు. గోదావరికి వచ్చిన వరద లెక్కలను కూడా అధికారులు సిద్ధం చేస్తోన్నారు. 10 సంవత్సరాల్లో వచ్చిన వరద, వచ్చే 10 సంవత్సరాల్లో సంభవించే వరద అంచనాలతో కూడిన ప్రతిపాదనలను రూపొందిస్తోన్నారు.

45.7 మీటర్ల వరకూ..
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిహారం చెల్లింపులను 45.7 మీటర్ల వరకు వర్తింపజేయాలనే డిమాండ్ వైఎస్ జగన్.. పోలవరం ముంపు గ్రామాల సందర్శన సందర్భంగా వినిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 41 మీటర్ల వరకే పరిహారం చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని 45.7 మీటర్లకు పెంచాలని వైఎస్ జగన్ కోరుతున్నారు. దీనికోసం నిర్వాసితుల కోసం 20 వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని, అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే భరించగలుగుతుందనీ చెప్పారు.

హామీ ఇచ్చినట్టే..
త్వరలోనే తాను ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరుతానని, నిర్వాసితుల డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్తాననీ భరోసా ఇచ్చారు.
పోలవరం నిర్వాసితులంతా మోడీనే తిట్టు కుంటున్నారని వైఎస్ జగన్ చెప్పారు. పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని, ఆ తరువాతే ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీళ్లను నింపుతామనీ హామీ ఇచ్చారు. నిర్వాసితుల కష్టాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థం అయ్యేలా వివరిస్తాననీ భరోసా ఇచ్చారు. ఇప్పుడు అదే అజెండాతో వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

విభజన హామీలు, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంపు..
దీనితో పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న విభజన హామీలను కూడా వైఎస్ జగన్ తన పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వివరించే అవకాశం ఉంది. ఎనిమిదేళ్లుగా విభజన హామీలు పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోవట్లేదు. అలాగే- ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్ఆర్‌బీఎం) కింద రుణాలను తీసుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న మూడుశాతాన్ని పెంచాలనీ ముఖ్యమంత్రి.. కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications