Tungabhadra Dam: 73 ఏళ్ల చరిత్రలోనే సువర్ణ ఘట్టం! నేడు చారిత్రాత్మక కలయిక
దక్షిణ భారత దేశానికి అన్నపూర్ణగా, మూడు రాష్ట్రాల ఆయువుపట్టుగా నిలిచిన ప్రఖ్యాత తుంగభద్ర డ్యామ్ 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నేడు ఒక అత్యంత అరుదైన, సువర్ణ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మకంగా అమర్చిన 33 సరికొత్త క్రెస్ట్ గేట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకె. శివకుమార్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కలిసి నేడు (జూన్ 25న) ఉమ్మడిగా ప్రారంభించనున్నారు. ఒకే వేదికపై ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండటంతో హోస్పేట అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
రెండు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు జీవనాడి అయిన తుంగభద్ర ప్రాజెక్టుకు 2024 ఆగస్టులో ఒక పెద్ద విపత్తు ఎదురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన భారీ వరద ఉధృతికి డ్యామ్ లోని 19వ నంబర్ క్రెస్ట్ గేటు పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పట్లో నీటి వృధాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని, ప్రముఖ సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలో రికార్డు సమయంలో తాత్కాలిక 'స్టాప్‌లాక్' గేటును అమర్చి ప్రమాదాన్ని తప్పించారు. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ప్రకారం.. భవిష్యత్తు భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్యామ్ లోని మొత్తం 33 స్పిల్ వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. దీనికోసం కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు ఉమ్మడిగా రూ.51 కోట్ల నిధులు కేటాయించి, కేవలం ఆరు నెలల రికార్డు కాలంలోనే అత్యాధునిక సాంకేతికతతో కూడిన 33 కొత్త గేట్ల నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయిని..
తుంగభద్ర డ్యామ్ భద్రత ఏపీకి అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం పరిధిలో దాదాపు 1.46 hct (హెక్టార్లు - సుమారు 3.6 లక్షల ఎకరాలు) ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. వందలాది గ్రామాలకు ఇది తాగునీటిని అందిస్తోంది. ప్రాజెక్టు గేట్ల ఆధునికీకరణ పూర్తి కావడంతో ఈ ప్రాంతాల రైతుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు హోస్పేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
తెలంగాణ జల హక్కులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..
ఈ మైలురాయి లాంటి ఘట్టంలో పాల్గొంటున్న తరుణంలోనే.. తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల సాధనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. తుంగభద్ర నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 TMC (టీఎంసీల) నీటికి బదులు, ప్రస్తుతం కేవలం 5-6 టీఎంసీలు మాత్రమే వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర బోర్డు (RDS) కింద జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో ఉన్న 83,987 ఎకరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందాల్సి ఉందని గుర్తుచేశారు. ఈ అంతరాష్ట్ర నీటి వాటాల సమర్థ వినియోగానికి కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలోని తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ ప్రయోజనాల కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని గరిష్టంగా వాడుకునేలా మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.














Click it and Unblock the Notifications