కాసేపట్లో హైదరాబాద్ కు జగన్-కృష్ణ భౌతిక కాయానికి నివాళులు-భావోద్వేగ ట్వీట్..
ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన టాలీవుడ్ దిగ్గజ హీరో, నిర్మాత ఘట్టమనేని కృష్ణ భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హైదరాబాద్ వెళ్లనున్నారు. కృష్ణ ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడంతో పాటు కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించనున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతిపై సీఎం జగన్ ఇప్పటికే ఉదయం రెండు ట్వీట్లు పెట్టారు. ఇందులో ఆయన కృష్ణ మరణంపై భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్ అని సీఎం జగన్ కొనియాడారు. ఆయనే అల్లూరి, ఆయనే మన జేమ్స్ బాండ్ అన్నారు. నిజజీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగువారికి తీరనిలోటని సీఎం జగన్ తన ట్వీట్ లో అభివర్ణించారు.

మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ మరో ట్వీట్ లో తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణ కుమారుడు మహేష్ బాబు ఆయనతో వచ్చి ఓసారి సమావేశమయ్యారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆరోజు పలు చర్చలు జరిపిన జగన్.. ఆతర్వాత ఇండస్ట్రీతో ఉన్న గ్యాప్ ను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శిస్తే ఆ మేరకు పాజిటివ్ సంకేతాలు వెళ్లే అవకాశముంది.












Click it and Unblock the Notifications