అమిత్ షాకు సిగ్గుందా ? మోడీతో గ్యాప్ వల్లే జగన్ పై కామెంట్స్-డిప్యూటీ సీఎం షాకింగ్..
ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా వైసీపీ సర్కార్ పై చేసిన విమర్శల దుమారం ఇంకా తగ్గడం లేదు. అంతే కాదు రోజురోజుకీ పెరుగుతోంది. అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ మంత్రుల ఎదురుదాడి కూడా కొనసాగుతోంది. ఇవాళ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అమిత్ షాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీడీపీ-బీజేపీ పొత్తు, పవన్ కళ్యాణ్ వారాహి టూర్ పైనా కొట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో తెలుగుదేశం కోవర్టులు రాసిచ్చిన స్క్రిప్టునే అమిత్ షా చదివేశారంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. అలా చదవడానికి ఆయనకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. మోడీ కి అమిత్ షా కు మధ్య గ్యాప్ ఉండబట్టే ఏపీ సీఎం జగన్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోందన్నారు. విశాఖ లో అమిత్ షా, కాళహస్తి లో నద్దా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టు ఆక్షేపించారు. ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు చౌకబారు ఆరోపణలు చేశారన్నారు.

మోడీ నోటివెంట జగన్ కు వ్యతిరేకం గా ఒక్క మాట కూడా రాలేదని, గతం లో చంద్రబాబు ఢిల్లీ వెళ్తే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని దాఖలాలు ఉన్నాయని కొట్టు గుర్తుచేశారు. బీజేపీలో టీడీపీ కోవర్టుచెప్పిన మాటలు నమ్మితే పోలవరం నిధులు 13 వేల కోట్లు, రెవెన్యూ లోటు 10 వేల కోట్లు వస్తాయా అని ప్రశ్నించారు. జగన్ పై ఉన్న ప్రత్యేక అభిమానం తోనే ఆ డబ్బులు మోడీ విడుదల చేశారన్నారు. గతంలో పోలవరం నిధులు ఏటీఎమ్ కింద వాడేస్తున్నారు అని స్యయాన మోడీ చంద్రబాబుపై విమర్శలు చేశారని కొట్టు గుర్తుచేశారు.
తనకున్న అవగాహన మేరకు అమిత్ షా, మోడీల మధ్య విభేదాలు వచ్చాయని అనుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం కొట్టు పేర్కొన్నారు. మోడీకి జగన్ పై ఉన్న విశ్వాసం ఉండబట్టే నిధులు వచ్చాయన్నారు. మహాజన సభ లో మోడీని పోగడల్సింది పోయి జగన్ ను తిట్టారన్నారు. ఇలా తిడితే ఆంధ్రులు మెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రులు సంతోషిస్తారన్నారు. బిజెపి - టిడిపి కలిస్తే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలే చందాన కనిపిస్తోందన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారం కోసం వారాహి యాత్ర చేసుకుంటే తమకేమీ ఇబ్బంది లేదని డిప్యూటీ సీఎం కొట్టు తెలిపారు. కొందరు యువత మాత్రమే ఆయన వెనుక వెళ్తారన్నారు. దేవాలయానికి భక్తుల రూపంలో ఎవరూ వచ్చినా ఆంక్షలు ఏమీ ఉండవన్నారు. ఆలయ పరిసరాల్లో రాజకీయ ప్రచారాలు చేయడం నిషిద్ధమన్నారు. అందుకే శాంతి భద్రతల గురించి జిల్లా ఎస్పీకి ఆలయ ఈవో లేఖ రాశారన్నారు. పవన్ మనల్ని మోసం చేస్తున్నాడని కాపులు అనుకుంటున్నారని కొట్టు తెలిపారు. మనల్ని అద్దం పెట్టుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్తున్నాడని అంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications