మెగా PTM 3.0 : చిలకలూరిపేటలో డిప్యూటీ సీఎం.. పవన్ అభిమానినన్న ప్రత్తిపాటి !
తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకే అంతటి స్థానం ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఎదుగుదలకు ఈ పేరెంట్ - టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుందన్నారు. విద్యార్థులు పాఠశాలలో ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పరని భవిష్యత్తును సైతం తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. మొన్న పిఠాపురం స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవని కొందరి రాజకీయ లబ్దికోసం కుల గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు.

విద్యార్దులపై ప్రశంసలు..
సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడు జుబేదా, రిహానలు ఫిజిక్స్ కు సంబంధించిన ఫైర్ అలారమ్, డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి గురించి బాగా వివరించారన్నారు. వారిలోని ఉన్న టాలెంట్ వెలికి తీస్తే దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రెస్పరెటరీ సిస్టం గురించి పదో తరగతి విద్యార్థిని నయోమి బాగా వివరించిందన్నారు. శ్రుతి కుట్లు, అల్లికల గురించి, రత్నకుమార్ ఆర్ట్స్ అండ్ స్కిల్ గురించి బాగా చెప్పారన్నారు.
అలానే పాఠశాల మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గౌసియాను డిప్యూటీ సీఎం అభినందించారు. ఉపాధ్యాయురాల్లను చూస్తుంటే కొన్నిసార్లు బాధేస్తుందన్నారు. పిల్లలను వారు ఎంతో ఓపికగా భరిస్తుంటారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతికతతో బోధనను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించామన్నారు పవన్. క్రియేటివ్ కెపాసిటీ, ఆవిష్కరణ చేసే ఆలోచన రావాలంటే స్వయంగా పుస్తక పఠనం చేయడం అవసరం అన్నారు. కేవలం టెక్నాలజీతోనే అవి సాధ్యపడవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మైదానం, లైబ్రరీకి పవన్ హామీ..
శ్రీ శారద పాఠశాలకు కావాల్సిన మైదానం విషయమై కూడా స్థలం కేటాయింపు కోసం ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. లైబ్రరీని సొంతగా మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. లైబ్రరీ నిండిపోయేన్ని పుస్తకాలతో పాటు బీరువాలు కూడా పంపిస్తామని చెప్పారు. వాటితో పాటు 25 కంప్యూటర్లు సొంత ఖర్చుతో ఇస్తానని పవన్ వెల్లడించారు.
Honorable Deputy Chief Minister Shri @PawanKalyan interacting with students as part of a Mega Parents - Teachers meeting at ZPHS, Chilakaluripet.#AndhraPradesh pic.twitter.com/hfKhsVi1MX
— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 5, 2025
విద్యార్థులు ఉదయించే సూర్యులని.. భవిష్యత్తు వారిదే అని చెప్పుకొచ్చారు. సోషల్ టీచర్ చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పిన పాఠాలే తనను ఈ స్థాయికి తెచ్చాయన్నారు. పొద్దున లేస్తే బూతులు తిట్టే వ్యక్తులు, వినోదం పంచే సినిమాకు వీలైనంత దూరంగా ఉండాలన్నారు. మరి ముఖ్యంగా పోలీసులు, తల్లిదండ్రులు మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని గుర్తించి.. ఆ మత్తు నుంచి బయటపడేసే ప్రయత్నం చేయాలని సూచించారు.
ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సైతం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో యువత కోసం కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తామని, యువత కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని.. ఆయనతో సినిమా తీయాలని భావించినట్టు తెలిపారు. అలాగే ఐఏఎస్ కృష్ణతేజ చిలకలూరిపేటలో కోట్ల రూపాయల విలువైన స్థలాలను ప్రభుత్వానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications