అనారోగ్య సమస్యలపై నోరు విప్పిన పవన్.. అసలు కారణం అదే !!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు కీలక అంశాలపై వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
కరోనా తర్వాత ఆరోగ్య సమస్యలు..
తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. కరోనా అనంతరం వచ్చిన లంగ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గలేదని వెల్లడించారు. తరచూ బయట తిరగడం, ప్రజల్లో ఉండడం వల్ల సైనస్ సమస్యలు తీవ్రం కావడంతో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నానని తెలిపారు. అలానే అభిమానుల ప్రేమ కూడా కొన్నిసార్లు శారీరక ఇబ్బందులకు కారణమైందని సరదాగా వ్యాఖ్యానించారు. అభిమానులు కలిసినప్పుడు చేతులు బలంగా లాగడం వల్ల భుజాల మధ్య గ్యాప్ వచ్చిందని నవ్వుతూ చెప్పారు. స్పైనల్ సమస్యలు కూడా ఉన్నాయని, కానీ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉండటం వల్ల నొప్పిని భరించే సామర్థ్యం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ప్రజాసేవ కోసం మరింత శక్తిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

విజయ్‌తో పోలికలపై పవన్ ఫైర్..
ఇక తమిళనాడు రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పోల్చడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడులో నటుడు Vijay రాజకీయాల్లోకి వచ్చి విజయవంతం కావడంతో, కొందరు తన రాజకీయ ప్రయాణాన్ని అతనితో పోలుస్తున్నారని విమర్శించారు. "ఒక రాష్ట్రంలో జరిగినది ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని భావించడం సరికాదు. అక్కడి రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడివి వేరు" అని స్పష్టం చేశారు. "ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారు" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తనతో ఉన్న చాలామంది నాయకులు పార్టీని వీడిపోయారని పవన్ గుర్తుచేశారు. అయినప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని, ఎన్నో అవమానాలు, ఒత్తిళ్లు, రాజకీయ దెబ్బలు ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టానన్నారు. "దెబ్బలు తినకుండా రాజకీయాల్లో ఎదగలేం. 2007 నుంచి 2018 వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. చివరకు 2024లో అధికారంలో భాగస్వామ్యం అయ్యాం" అని పేర్కొన్నారు.
జనసేన విస్తరణపై కీలక ప్రకటన..
జనసేన పార్టీ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా జనసేన సిద్ధాంతాలకు మంచి స్పందన వస్తోందన్నారు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలంటూ పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారని చెప్పారు. గత 12 ఏళ్లుగా పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోయామని, ఇకపై బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు.
వైసీపీపై ఘాటు విమర్శలు..
వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పరిపక్వత లేకుండా ఉన్నాయని పవన్ మండిపడ్డారు. వాస్తవ రాజకీయ పోరాటం అంటే ఏమిటో తెలియకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. తాను పదేళ్లకు పైగా ఒత్తిళ్లు, అవమానాలు, ఓటములు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, జనసేనను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. "ప్రజల కోసం నిలబడే రాజకీయాలు చేయాలి గానీ, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు" అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications