బాబు టీం: సిఎస్ ఐవిఆర్, డిజిపి జెవి రాముడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తొలి డిజిపిగా జాస్తి వెంకట రాముడు (జెవి రాముడు)ను నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. ఎపిలో సిఎస్ పదవికి సీనియర్ అధికారులు ఐవి సుబ్బారావు, ఐవైఆర్ కృష్ణారావు పేర్లు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.
వీరిలో ఐవి సుబ్బారావు గత రెండేళ్లుగా యునెస్కో బాధ్యతల్లో విదేశాల్లో ఉన్నారు. ఆయనకు ఇంకా మూడేళ్ల సర్వీసు ఉంది. దీనికితోడు ఆయన అంత త్వరగా అక్కడ పదవిని వదులుకొని రావడం కష్టమే. ఈ పరిణామం ఐవైఆర్‌కు మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడబోతున్న తరుణంలో ఇక్కడ ఉండి పనిచేస్తున్న అధికారులకు సమస్యలపై అవగాహన ఉంటుందన్న అభిప్రాయంతో ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవైఆర్‌పై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిజిపిగా జెవి రాముడును నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సీఎం కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా అజయ్ సహానీని నియమిస్తారని, కార్యదర్శులుగా గిరిధర్, సాయిప్రసాద్‌లను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ పోస్టులకు ప్రతిపాదనలను శనివారంలోపు అందజేయాలని శుక్రవారం చంద్రబాబును కలిసిన అధికారుల బృందం కోరింది.
కొత్త రాష్ట్రాలు జూన్ రెండో తేదీ నుంచి ఆవిర్భవిస్తున్నందువల్ల ఈ నాలుగు పోస్టులు ఆ రోజుకు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ప్రతిపాదనలు అందజేస్తే వాటిని కేంద్రానికి పంపుతామని తెలిపింది. ఈ ప్రతిపాదనలను కేంద్రంలోని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆమోదించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications