ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తొలిఫలితం కొవ్వూరు, నరసాపురం... చంద్రగిరితో పాటు అక్కడ చివరి ఫలితాలు !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగాను ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ, ఏపీలో ఎన్నికల ఫలితాల పైన మాత్రం దేశం దృష్టి కేంద్రీకృతమైంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసే పార్టీ ఏది అన్నది ఇప్పుడు ప్రధానంగా అందరిలోనూ ఉత్కంఠ ను రేకెత్తిస్తుంది.
ఎన్నికల కౌంటింగ్ పై ఏపీలో ఆసక్తి
ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఏ విధంగా సాగుతుంది? ఏ సమయానికి పూర్తి ట్రెండ్ అర్థమవుతుంది? ఏ నియోజకవర్గం ఫలితం ముందు వస్తుంది? ఆఖరుగా ఏ నియోజకవర్గం ఫలితాలు వస్తాయి? వంటి చర్చ ఏపీ ప్రజలలో జోరుగా సాగుతుంది. పోలైన ఓట్లు. కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుల్ ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపుకు అవసరమైన రౌండ్ లను నిర్ధారించింది.

తొలి ఫలితం ఇక్కడే
రాష్ట్రంలో అన్నిటికంటే ముందు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో కేవలం 13 రౌండ్లలో నే లెక్కింపు పూర్తి చేయనున్న నేపథ్యంలో తొలి ఫలితం ఇక్కడే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
చివరి ఫలితాలు వచ్చేది ఎక్కడంటే
పాణ్యం, భీమిలి నియోజకవర్గాలలో 25 రౌండ్లు లెక్కింపు జరగనుంది. ఇక రంపచోడవరం ఎస్టి నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గాలలో అత్యధికంగా 29 రౌండ్ ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో చివరి ఫలితాలు ఈ నియోజక వర్గాలలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు నియోజకవర్గాలలో తుది ఫలితాలు వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచి చూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
175నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు
రాష్ట్రంలోని మొత్తం 175నియోజకవర్గాల్లో అత్యధికంగా 111నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్ల లోపే లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నం రెండు గంటల్లోగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక 60 నియోజకవర్గాలలో 21 నుండి 25 రౌండ్ల వరకు లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గ ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. 29 రౌండ్ల పార్టీ లెక్కింపు జరిగే రెండు నియోజకవర్గాల ఫలితాలను రాత్రి 7గంటల నుండి 8గంటల సమయంలో వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications