ap elections: శృంగవరపు కోట ఎవరికి కంచుకోటగా మారుతుంది!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాలలో శృంగవరపుకోట నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో 1951 నుంచి ఇప్పటివరకు సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏడుసార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయిదు సార్లు విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒకసారి, గత ఎన్నికలలో కడుబండి శ్రీనివాస్ రావు విజయం సాధించాడు.
2019 ఎన్నికలలో ఇక్కడనుండి వైసిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కడుబండి శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్ధి కోళ్ల లలితకుమారిపై 11,246 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైసీపీ తరఫున మరోమారు సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుకు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ఆధిపత్య పోరు కొనసాగుతున్న క్రమంలో, చోటు చేసుకున్న పరిణామాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఎమ్మెల్సీ రఘురాజు భార్య ఇందుకూరు సుధారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులతో కలిసి ఆమె నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. దీంతో త్వరలో ఎమ్మెల్సీ రఘురాజు కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్న చర్చ జరుగుతుంది.
ఏది ఏమైనా వైసీపీలో కొనసాగుతున్న అంతర్గత పోరు వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపించదని, సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి మాత్రమే తమను గెలిపిసస్తాయని, కడుబండి శ్రీనివాసరావు బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే గత ఎన్నికలలో వైసిపి అభ్యర్థి పై పోటీ చేసి ఓటమిపాలైన కోళ్ల లలిత కుమారి మరో మారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారు.
అయితే టిడిపి జనసేన కూటమి నుండి ప్రవాసాంధ్రుడు గొంప కృష్ణ కూడా టికెట్ ను ఆశిస్తున్నారు. టిడిపి జనసేన రెండవ జాబితా ప్రకటిస్తే ఇక్కడ టిక్కెట్టు ఎవరికో ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఎవరికి వారు టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications