జగన్ సర్కార్ పై పోరు విషయంలో ఉద్యోగ సంఘాల్లో చీలిక ?
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తాను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానంటూ గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు గంపగుత్తగా మద్దతు ఇచ్చి వైసీపీని గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక కీలక హామీలైన సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సంతృప్తికరంగా పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు వంటి అంశాలు పరిష్కారం కాలేదు. దీంతో ఉద్యోగులు కొంతకాలంగా పోరుబాట పట్టారు.
అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెలబెట్టుకోలేదంటూ కొన్ని ఉద్యోగసంఘాలు పోరాటాలు చేస్తుంటే మరికొన్ని మాత్రం ప్రభుత్వంపై పోరు అవసరం లేదని చెబుతున్నాయి. దీంతో హామీలు నిలబెట్టుకునే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరు అవసరం ఉందని కొందరు, అవసరం లేదని మరికొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల మధ్య చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.

ఉద్యోగుల హామీలు నెరవేర్చే విషయంలో ప్రభుత్వంపై రెండు కీలక సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. మరో రెండు సంఘాలు మాత్రం ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి. ఇందులో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న సంఘాల్లో బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ఏపీ జేఏసీ అమరావతితో పాటు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న సంఘాల్లో వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యతో పాటు బండి శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీ ఎన్జీవో సంఘం ఉన్నాయి.

వీటిలో ప్రభుత్వంపై పోరుకు ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి రెండు దశలుగా ఉద్యమం చేపట్టింది. అది కాస్తా పూర్తవడంతో ఇప్పుడు మూడో దశ ఉద్యమం చేస్తోంది. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా ఈ నెల చివర్లో తమ కార్యాచరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో కలిసి రావాలని మిగతా ఉద్యోగ సంఘాల్ని కూడా కోరుతోంది. దీంతో ఇప్పటికే ప్రభుత్వానికి కంటగింపుగా మారిన కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని సంఘానికి మిగతా సంఘాలు ఏమేరకు మద్దతిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications