చర్చల వేళ ఏపీ సర్కార్ కు ఉద్యోగ సంఘాల ట్విస్ట్- నిరసనలకు నో బ్రేక్..!
ఏపీలో పీఆర్సీ, ఐఆర్ ప్రకటనలు, డీఏ సహా ఇతర బకాయిల చెల్లింపు వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగ సంఘాల ఏపీ జేఏసీ అమరావతి (AP JAC Amaravati) మూడు దశల నిరసనల కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా ఉద్యోగులు విధులకు హాజరవుతూనే నిరససనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని శనివారం చర్చలకు ఆహ్వానించింది. దీంతో వారు చర్చలకు వెళ్లే ముందే నిరసనలకు బ్రేక్ ఇస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
రాష్ట్రంలో ఉద్యోగులు (AP employees) ఎదుర్కొంటున్న ఆర్దిక, ఆర్దికేతర సమస్యలపై తాము ఉద్యమ కార్యాచరణను చేపట్టిన నేపథ్యంలో, ఉద్యోగులు సంఘాలకతీతంగా ఐక్యంగా దీనికి మద్దతివ్వడంతో ప్రభుత్వం (AP Govt) చర్చలకు ఆహ్వానించడం శుభపరిణామమని ఏపీ జేఏసీ అమరావతి నేతలు తెలిపారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి లభించిన తొలి విజయంగా భావిస్తున్నామని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఉద్యోగులు ప్రధానంగా కోరుకుంటున్నది ఆర్థిక ప్రయోజనాల పరిష్కారమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ మేరకు రేపు 5వ తేదీ ప్రకటించిన భోజన విరామ సమయంలో "డిమాండ్స్ డే" నిరసనలు యధాతథంగా కొనసాగుతాయని వారు తెలిపారు.

అతి తక్కువ కాలపరిమితితో కూడిన పీఆర్సీ కమిషనర్ ను వెంటనే నియమించడంతో పాటు, ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున మధ్యంతర భృతి మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పింఛను పునరుద్ధరించాలని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్యలను పరిష్కరించాలని, గ్రామవార్డు సచివాలయ ఉధ్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఇంతవరకు కనీసం సర్వీస్ రూల్స్ లేకుండా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్ ను రూపొందించాలని కోరారు. అలాగే ఆర్టీసిలో ప్రవేశ పెట్టనున్న విధ్యుత్ బస్సులు ప్రైవేటు ఆఫరేటర్లకు ఇవ్వకుండా ఆర్టీసి ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జులై 22 వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి లేవనెత్తిన ఇతర 30 డిమాండ్స్ ను పరిష్కరించాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications