ఏపీ ఉచిత బస్సుకు భారీ రెస్పాన్స్-రోజుకు 20 లక్షలపైగా..! త్వరలో ఇవే..!
ఏపీలో ఆగస్టు 15న కూటమి సర్కార్ ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ సక్సెస్ అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాల్ని ఇవాళ అసెంబ్లీలో సర్కార్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతీ రోజూ దాదాపు 20 లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకం వాడుకుంటున్నారు. దీంతో బస్సుల్లోనూ రద్దీ పెరిగిపోతోంది. ఈ వివరాల్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
శాసన మండలిలో సూపర్ సిక్స్ అమలులో భాగంగా స్త్రీ శక్తి పధకం గురించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, శాఖ పరంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో ఈ పథకం సజావుగా కొనసాగుతోందన్నారు.గతంలో సుమారు 40 శాతం మహిళలు మాత్రమే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 62 శాతానికి పెరిగిందన్నారు. రోజూ సగటున 22 లక్షల మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు.

మహిళమణులకు నెలకు సుమారు 2,000-3,000 రూపాయల వరకు ప్రయాణ ఖర్చు ఆదా జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయని రవాణామంత్రి తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్యా రోజువారీ గతంలోని 9. 7 లక్షల నుండి 20 .73 లక్షలకు పెరిగింది. అంటే రెట్టింపు అయిందన్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించిన బస్సులలో అక్కుపెన్సి 69 శాతం నుండి 90 శాతానికి పెరిగిందన్నారు. వార్షిక వ్యయం ఈ పధకం మీద ప్రభుత్వం పై రూ 1942 కోట్ల ఉంటుందని అంచనా వేశారు.
రద్దీ రూట్లలో బస్సు ట్రిప్పులను పెంచడం, ప్రధాన బస్టాండ్లలో సూపర్వైజర్లు, అధికార్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 23 వరకు ఇప్పటికే 5.30 కోట్ల మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, అంచనా ప్రకారం ఈ సంఖ్య నెలకు 7 కోట్లకు చేరుతుందన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు కండిషన్స్, ప్రమోషన్లు, నైట్ ఎలవెన్సులు, పెండింగ్ బిల్లులు వంటి అనేక సమస్యలను పరిష్కరించిందని, మిగిలిన కొన్ని అంశాలను కూడా త్వరలో పరిష్కరించి ఉద్యోగులు సంతోషంగా పనిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ఇప్పటికే 1,500 కొత్త బస్సులను కొనుగోలు చేసి డిపోలకు ఇచ్చామని, వీటి కోసం దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పటి వరకు 750 ఎలక్ట్రిక్ బస్సుల కొరకు ఆర్డర్ ఇచ్చామని, ఇవి త్వరలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర పట్టణాల్లో నడుస్తాయని తెలిపారు. అదనంగా మరో 1,500 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో ప్రవేశపెట్టే ప్రణాళిక ఉందన్నారు. దశలవారీగా అన్ని పాత బస్సుల స్థానంలో ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.












Click it and Unblock the Notifications