భవనాల బిల్డర్లు, సర్వేయర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త...!
ఏపీలో ఐదేళ్లుగా కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి తిరిగి ఊపుతెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన బిల్డర్ల కోరిక మేరకు వారికి ఓ కీలక వెసులుబాటునిస్తూ అంగీకారం తెలిపింది. తాజాగా మంత్రి నారాయణతో జరిగిన భేటీలో ఈ మేరకు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, అధికారులకు క్లారిటీ ఇచ్చారు. ఇది కచ్చితంగా బిల్డర్లకు తమ భవనాల నిర్మాణం వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో భవన నిర్మాణాలు చేసే బిల్డర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిల్డింగ్ ఫీజుల్ని వాయిదాల్లో చెల్లించేందుకు మంత్రి నారాయణ అంగీకరించారు. ప్రస్తుతం బిల్డర్లు భవన నిర్మాణం ప్రారంభించగానే ఆయా ఫీజుల్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇలా భవన నిర్మాణం పూర్తి కాక ముందే ఫీజులు ప్రభుత్వానికి చెల్లించడం తమకు భారంగా మారిందని వారు తెలిపారు. అలా కాకుండా భవన నిర్మాణం పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చేలోగా వాటిని వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

దీంతో ప్రభుత్వం ఈ ఫీజుల్ని భవన నిర్మాణం ప్రారంభమైన తర్వాత వాయిదాల్లో 10 శాతం వడ్డీతో కలిపి చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. తద్వారా వారిపై ఆర్ధిక భారం తగ్గనుంది. అదే సమయంలో 300 చదరపు మీటర్లలో నిర్మించే భవనాలకు సెట్ బ్యాక్ తగ్గింపు, 300-500 చదరపు మీటర్లలో నిర్మించే భవనాలకు సెట్ బ్యాక్ తగ్గింపుతో పాటు టీడీఆర్ బాండ్లు వాడుకునే అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తిపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో ఆయా విషయాల్లోనూ వారికి ఊరటదక్కే అవకాశం ఉంది.
మరోవైపు బిల్డింగ్ పర్మిషన్ల కోసం సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆన్ లైన్ లో ప్లాన్ దరఖాస్తు చేసేందుకు ఇచ్చే సర్వేయర్ లైసెన్స్ ను కేవలం రూపాయికే ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రూ.5 వేలుగా ఉన్న ఈ ఫీజు కాస్తా రూపాయికి తగ్గబోతోంది. అలాగే భవన నిర్మాణాలకు ఫాస్ట్ ట్రాక్ విధానంలో అనుమతుల జారీ విషయంలోనూ చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications