మంతెన సత్యనారాయణరాజుకు చంద్రబాబు బంపర్ ఆఫర్..!
ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైద్యుడిగా మంచి పేరున్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇవాళ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట పక్కనే ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసుకుని సేవలు అందిస్తున్న మంతెనకు గుర్తింపునిచ్చింది. ఈ మేరకు ఆయన్ను ఓ కీలక పదవిలో నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు కొన్ని దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎన్నో రోగాల్ని నయం చేస్తున్నారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు మందులు లేకుండా వ్యాధులను నయం చేయడానికి ఉప్పు రహిత, నూనె రహిత ఆహారాలు, యోగా, సహజ చికిత్సలు అందిస్తుంటారు. ఆయనకు విజయవాడతో పాటు నర్సాపురం, అమరావతిలలో ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. వీటిలో రోగులకు ఆయనతో పాటు భార్య డాక్టర్ విశాల కూడా నీరు, బురద, ఉపవాస, సూర్యకాంతి చికిత్సలు అందిస్తుంటారు.

చంద్రబాబు కుటుంబంతోనూ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే టీడీపీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైద్యం విషయంలో మంతెన సలహాలు, సూచనలు తీసుకునేందుకు సలహాదారు పదవిలో నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు జీతభత్యాలు ఎంత ఇస్తారు, ఇతర వసతులతో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో తెలిపింది.












Click it and Unblock the Notifications