ఉద్యోగులకు ప్రభుత్వం కీలక హామీలు - త్వరలో కారుణ్య నియామకాలు..!!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ఉద్యోగుల 461 డిమాండ్లలో 341 డిమాండ్లు పరిష్కరించామని సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. మిగిలిన వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ కీలక అంశాల పై చర్చించారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పరిష్కారం అయిన అంశాలను గుర్తు చేసారు.
సమస్యలకు పరిష్కారం: ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో వరుస సమావేశాల ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని సీఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. సమస్యలపైన ఉద్యోగ సంఘాలతో తరచూ చర్చలు జరుగుతున్నాయని వివరించారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య విధానంలో త్వరలోనే 1042 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల వేతన సవరణకు తాజాగా కమిటీ నియమించిన అంశాన్ని గుర్తు చేసారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం పైన త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వివిధ శాఖల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆ శాఖల ఉన్నతాధికారులు వివరించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్: సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగ సంఘాల నేతలు స్వాగతించారు. 40 రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘ నేత బండి శ్రీనివాస రావు చెప్పారు. కొత్త జిల్లాల కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు.
పెన్షనర్ల డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. పోలీసులు, ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలు రూ 800 కోట్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఓపీఎస్ అమలు చేయాలని సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులు అందరి క్రమబద్దీకరణ కు ఒకే జీవో ఇస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
ఓపీఎస్ టు జీపీఎస్: వారంతా పని చేసే చోట రెగ్యులర్ చేసేంత వరకు నోటిఫికేషన్ లు ఇవ్వద్దని కోరినట్లు వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలో కంటే బాగుందని వ్యాఖ్యానించారు. జీపీఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో సంప్రదించాలని సమావేశంలో కోరారు. దీనికి సీఎస్ అంగీకారం తెలిపారు.
జగనన్న లే అవుట్లలో కాకుండా జిల్లా ముఖ్య కేంద్రాల్లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరినట్లు సంఘాల నేతలు చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని..జీతాలు పెంచాలని కోరగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. ఇక పై ప్రతీ నాలుగు నెలలకు ఒక సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు












Click it and Unblock the Notifications