అమరావతి రైతుల ఫ్లాట్లు, రిజిస్ట్రేషన్లపై సర్కార్ కీలక ప్రకటన..!
ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం గతంలో భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వడంతో పాటు వాటికి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేయించి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం ఇంకా పూర్తి స్దాయిలో అమలు కాకపోవడంతో వాటిపై సోషల్ మీడియాలో రోజుకో చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతుల్ని భయబ్రాంతులకు గురి చేసేలా జరుగుతున్న ప్రచారాలపై మంత్రి నారాయణ స్పందించారు.
అమరావతి రైతులకు ప్లాట్ ల కేటాయింపు,రిజిస్ట్రేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మున్సిపల్ మంత్రి నారాయణ ఆరోపించారు. సోషల్ మీడియా లో ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ ల కేటాయింపు,రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని ఆన ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ కింద 30,635 మంది రైతులకు 34,911.23 ఎకరాలకు సంబంధించి ప్లాట్ లు కేటాయించాల్సి ఉందన్నారు. ఇందులో ఇప్పటివరకూ 29,644 మంది రైతులు ఇచ్చిన 34,192.19 ఎకరాలకు ప్లాట్ ల కేటాయింపు పూర్తయిందన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ 2727 మంది రైతులకు 3188 ఎకరాలకు సంబంధించి ప్లాట్ ల కేటాయింపు పూర్తయిందని మంత్రి తెలిపారు. ఇంకా 991 మంది రైతులకు 719 ఎకరాలకు సంబంధించిన ప్లాట్ లు కేటాయించాల్సి ఉందన్నారు. రిటర్నబుల్ ప్లాట్ లలో ఇంకా 2501 మందికి 8441 ప్లాట్ లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

ఈ నేపథ్యంలో అమరావతిలో రైతులతో మాట్లాడి పెండింగ్ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్ ల కేటాయింపు,రిజిస్ట్రేషన్ లు మొత్తం పూర్తి చేస్తామన్నారు. సాంకేతిక సమస్యలతో 484 మంది రైతులకు 3.15 కోట్ల కౌలు చెల్లింపులు పెండింగ్ ఉందన్నారు. రైతులకు అవాస్తవాలు చెప్పి గందరగోళానికి గురి చేయవద్దని మంత్రి నారాయణ సోషల్ పోస్టులు పెట్టే వారికి సూచించారు.












Click it and Unblock the Notifications