బెజవాడ సేఫ్ గా ఉండాలంటే రూ.3250 కోట్లు పెట్టాల్సిందే..!
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కీలకమైన నగరం విజయవాడ. అమరావతితో పాటే ఇంకా చెప్పాలంటే అమరావతి కంటే వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న విజయవాడ నగరానికి తాజాగా ఓ పెద్ద షాక్ తగిలింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో వరదలు వచ్చాయి. బుడమేరు వాగు పొంగడంతో నగరంలో సగం మునిగిపోయింది. దీన్నుంచి కోలుకునేందుకు ఏకంగా నెల రోజులు పట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు బెజవాడను సురక్షితంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
విజయవాడ నగరాన్ని బుడమేరు వరదల నుంచి రక్షించాలంటే భారీ చర్యలు అవసరమని మున్సిపల్, జలవనరులశాఖ మంత్రులు పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు నిర్ధారించారు. బుడమేరు వరదల తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అధ్యయనం చేసిన మంత్రులు.. తాజాగా ఈ వివరాలను బయటపెట్టారు. ఇందులో రూ.3250 కోట్లు ఖర్చుపెడితే విజయవాడ నగరం మరోసారి మునగకుండా బుడమేరు ఆధునీకరణ చేపట్టవచ్చని తేల్చారు.

విజయవాడ నగర పరిధిలో బుడమేరు వాగు ప్రవహిస్తున్న ప్రాంతంలో ఆధునీకరణ పనులు చేపట్టేందుకు రూ.3250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. బుడమేరు వాగుకు 10 వేల క్యూసెక్కుల వరద వస్తే తట్టుకునేందుకు వీలుగా ఈ మొత్తం ఖర్చుపెట్టాలని అంచనా వేశారు. ఇందులో బుడమేరు వాగును వెడల్పు చేసేందుకు భూసేకరణకే 610 కోట్లు ఖర్చవుతోంది. బుడమేరును ఆనుకుని ఉన్న ఇళ్లలో వారికి పునరావాసం కల్పించేందుకు మరో 610 కోట్లు ఖర్చు చేస్తారు. రిటైనింగ్ వాల్, టన్నెల్ ఆధునీకరణ పనులకు మరో 600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
బుడమేరు కాలువ సామర్ధ్యాన్ని 17500 క్యూసెక్కుల నుంచి 37500 క్యూసెక్కులకు పెంచుతామని జలవనరుల మంత్రి రామానాయుడు తెలిపారు. వెలగలేరు నుంచి కొల్లేరు వరకూ ఈ సామర్ధ్యం పెంచుతామన్నారు. ప్రస్తుతం అధ్యయనం చేసిన అంశాలకు తోడు మరికొన్ని అంశాలపైనా అధ్యయనం చేసి ఈ నెల 18న సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ ఇస్తామని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications