వైఎస్ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్-సుప్రీంలో ఏపీ సర్కార్ అఫిడవిట్..!
ఏపీలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ఈ కేసులో ఆయన పాత్రను నిర్ధారించేలా ఏపీ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే సీబీఐ ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేయగా.. ఆయన మాత్రం సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గతంలో పులివెందుల పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై మరోసారి విచారణ జరిపిన పోలీసలుు.. కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేల్చారు.

అయితే వైఎస్ అవినాష్ రెడ్డి సూచనల మేరకే వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇలా పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివేకా కుమార్తె, అల్లుడిని ఈ హత్య కేసులో ఇరికించే లక్ష్యంతోనే వైఎస్ అవినాష్ రెడ్డి కృష్ణారెడ్జి సాయంతో ఈ ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారని పులివెందుల కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఇదే విషయాన్ని పేర్కొంటూ సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications