తేలిన అన్నదాత సుఖీభవ రెండో విడత లెక్క..! నిధుల జమకు ముహుర్తం ఫిక్స్..!
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా లబ్దిదారులకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు జమ చేసింది. దీంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. అయితే ఈ పథకంలో అర్హులై ఉండి కూడా ఈకేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ పూర్తి కాకపోవడంతో మరికొందరు మాత్రం నిధులు అందుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వం వీరికి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు వారి నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది.
అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల జమలో వివిధ కారణాలతో డబ్బులు రాని వారికి ప్రభుత్వానికి తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ వ్యవసాయ శాఖ అవకాశం కల్పించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10, 915 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే అత్యధికంగా 1290 మంది ఇలా రెండో విడతలో అన్నదాత సుఖీభవ నిధులు కోరుతూ దరఖాస్తు చేశారు.

ఆ తర్వాత స్ధానంలో విజయనగరం జిల్లా నుంచి 1111 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల నుంచి వెయ్యిలోపు దరఖాస్తుల చొప్పున వచ్చాయి. దీంతో వీటిని తాజాగా వివిధ దశల్లో పరిశీలన జరిపారు. అనంతరం మండల వ్యవసాయ అధికారుల పరిధిలో 5,377 దరఖాస్తుల్ని ఆమోదించారు. అలాగే మరో 4,261 దరఖాస్తుల్ని పెండింగ్‌లో ఉంచారు. చివరిగా 29 దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించారు.

పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్లో తహసీల్దార్‌ల పరిధిలో 827 ఉండగా, 411 దరఖాస్తుల్ని ఆమోదించి, 10 దరఖాస్తుల్ని మాత్రం తిరస్కరించారు. దీంతో రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు అర్హులైన వారి జాబితా ఖరారైనట్లయింది. వీరి ఖాతాల్లో ఈ నెలలోనే నిధులు జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వానికి వివరాలు పంపారు. ప్రభుత్వం వీటిని ఆమోదించి త్వరలోనే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేయబోతోంది.












Click it and Unblock the Notifications