ఏపీలో సినిమా హాళ్లకు షాక్: స్పెషల్ డ్రైవ్: 3 థియేటర్లు సీజ్: సంక్రాంతి వరకూ
అమరావతి: ఏపీలో సినిమా థియేటర్ల యాజమాన్యానికి ప్రభుత్వం వరుస షాక్‌లను ఇస్తోంది. తాము నిర్ణయించిన విధంగా ఆన్‌లైన్ టికెట్ల వ్యవస్థను అంగీకరించని హాళ్లపై ఉక్కుపాదం మోపుతోంది. ముమ్మర తనిఖీలను నిర్వహిస్తోంది. ఏపీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జాయింట్ కలెక్టర్ల అనుమతితో టికెట్ల రేట్లను పెంచుకోవచ్చనే నిబంధన ఉన్నప్పటికీ.. దాన్ని ఉల్లంఘిస్తోన్న సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేస్తోన్నారు. తొలి రోజు మూడు థియేటర్లను మూయించారు.

స్పెషల్ డ్రైవ్..
నిబంధనలను పాటించని థియేటర్ల యాజమాన్యాలపై తక్షణ చర్యలు తీసుకున్నారు. అక్కడికక్కడే సీజ్ చేశారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో తొలివిడతలో ఈ తనిఖీలు కొనసాగాయి. సంక్రాంతి పండగ వరకూ దశలవారీగా ఈ తనిఖీలను కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. విజయవాడలో పలు థియేటర్లలో రెవెన్యూ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ స్వయంగా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

విజయవాడలో విస్తృతంగా..
పీవీఆర్ మల్టీప్లెక్స్, అప్సర, అలంకార్, శైలజ, క్యాపిటల్ సినిమాస్ అన్నపూర్ణ థియేటర్లల్లో విస్తృత తనిఖీలు కొనసాగాయి. సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అవన్నీ సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా? అనేది ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. థియేటర్లల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్‌లను తనిఖీ చేశారు. అమ్మకానికి ఉంచిన ఆహార పదార్థాల నాణ్యత, ప్యాకేజింగ్‌ను పరిశీలించారు. వాటి రేట్ల గురించి ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు.

విజయనగరంలో మూడు థియేటర్లు సీజ్..
రోజువారీ విక్రయిస్తోన్న టికెట్ల రేట్లు, వాటికి సంబంధించిన రికార్డులు, లెడ్జర్‌ను పరిశీలించారు. విజయనగరం జిల్లాలో చేపట్టిన ఈ తనిఖీలకు జూయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ సారథ్యం వహించారు. రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లు, స్థానిక పోలీసులు ఇందులో పాల్గొన్నారు. పూసపాటి రేగ, నెల్లిమర్ల, భోగాపురంలో నిబంధనలకు విరుద్ధంగా టికెట్లను విక్రయించడం, స్టాల్స్‌లో అత్యధిక ధరలకు ఆహార వస్తువులను విక్రయిస్తోన్నట్లు తెలియడంతో మూడు థియేటర్లను సీజ్ చేయాలని ఆదేశించారు.

సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని..
అగ్ని ప్రమాదాలను నివారించడానికి ఉద్దేశించిన ఫైర్ సేఫ్టీ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయకపోవడంతో మరో థియేటర్‌పై తక్షణ చర్యలకు దిగారు. కొత్త్ ఏడాది, సంక్రాంతి పండగను పురస్కరించుకుని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భారీగా క్రౌడ్ పుల్లింగ్ చేసే మూవీలు అవి. వందలాది మంది ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తుంటారు. సంక్రాంతి సీజన్ ముగిసేంత వరకూ ప్రేక్షకుల తాకిడి కొనసాగుతుంటుంది. సినిమా హిట్ అయితే.. ఈ రద్దీ మరింత తీవ్రం అవుతుంటుంది.
Recommended Video

అవాంఛిత సంఘటనలకూ చెక్..
ఈ సమయంలో ఏవైనా అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా టికెట్లను విక్రయించడం, ప్రేక్షకులపై అధిక భారాన్ని మోపేలా ఆహార పదార్థాలను విక్రయించడం వంటి చర్యలను అదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ తనిఖీలను చేపట్టింది. స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టింది. దశలవారీగా సంక్రాంతి వరకూ దీన్ని కొనసాగించనుంది. అప్పటి వరకూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు తమ లైసెన్స్‌లను రెన్యూవల్ చేయించుకోవడం, టికెట్ల విక్రయాలను నమోదు చేయడం వంటి చర్యలను పాటించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications