జగన్ సర్కార్ దిమ్మతిరిగే నిర్ణయం: బహిరంగ ప్రదేశాల్లో ఆ పని చేస్తే క్రిమినల్ కేసులు: ఉత్తర్వులు జారీ
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. ప్రత్యేకించి పొగాకు ఆధారిత ఉత్పత్తులను నమలడం, దాన్ని ఉమ్మి వేయడంపై నిషేధాన్ని విధించింది. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కూడా ప్రమాదకరమే. ఆ ఉమ్మి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Recommended Video

ఎప్పటిదాకా అమల్లో..
ఈ మేరకు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాజ్ఙలు ఎప్పటిదాకా అమలులో ఉంటాయనేది స్పష్టం చేయలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తక్షణమమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిషేధం జాబితాలో చేర్చిన వస్తువులివే..
నిషేధం జాబితాలోకి తీసుకొచ్చిన వస్తువులను వివరాలను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. పొగరాని పొగాకు ఉత్పత్తులు పాన్ మసాలా, సుపారీ వంటి వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో నమలడాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. వాటితో పాటు పెద్ద ఎత్తున ఉమ్మిని వెలువడించే ఎలాంటి పదార్థాలను కూడా బహిరంగ ప్రదేశాల్లో సేవించకూడదని ఆదేశించారు. వాటిని స్వీకరించిన అనంతరం ఉమ్మి వేయడాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు.

ఐసీఎంఆర్ ఆదేశాల మేరకే..
ఉమ్మి వల్ల కరోనా వైరస్ పెద్ద ఎత్తున ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించిన విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం ప్రమాదకరమని పేర్కొంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగా జగన్ సర్కార్.. ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వెంటనే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులను జారీ చేసినట్లు జవహర్ రెడ్డి వెల్లడించారు.

ఉల్లంఘిస్తే.. క్రిమినల్ కేసులు
ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వం. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్-1897, ది డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్-2005, క్రిమినల్ ప్రొసీజర్ కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం ద్వారా క్రిమినల్ కేసులను నమోదు చేస్తామనే విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా తెలియజేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications