ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ ?
ఏపీలో ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఈసారి ప్రభుత్వం బ్యాంకుల తరహాలో బకాయిలు రాబట్టేందుకు వ్యక్తిగతంగా పన్ను చెల్లింపుదారులకు సచివాలయాల సిబ్బందితో ఫోన్లు చేయించింది కూడా. అయినా చాలా చోట్ల ఇంకా బకాయిల చెల్లింపు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది. రెండేళ్లుగా ఇస్తున్న రాయితీని తగ్గించి ఈసారి వసూళ్లు చేయబోతున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ఆస్తిపన్ను బకాయిలపై గత రెండేళ్లుగా ప్రతీ ఏటా మార్చి నెల ఆరంభంలోనే వడ్డీ మాఫీ ప్రకటిస్తున్నారు. దీంతో జనం కూడా ఈ వడ్డీ రాయితీ కోసం ఈసారి కూడా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈసారి పూర్తి వడ్డీ మాఫీ కాకపోయినా అందులో 50 శాతం మాఫీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పురపాలకశాఖ పంపిన ప్రతిపాదనల్ని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలో పాత బకాయిలతో సహా రూ.2341.78 కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు జరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకూ కేవలం రూ.1525.91 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ప్రభుత్వం చేసేది లేక ఇక వడ్డీ మాఫీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలోలా పూర్తి వడ్డీ మాఫీ కాకుండా 50 శాతం మాత్రమే వడ్డీ మాఫీ చేయాలన్న ఆలోచనలో ఉంది. దీంతో కనీసం సగం బకాయిలు అయినా వసూలవుతాయని అధికారుల అంచనాగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఇవాళ, రేపట్లో దీనిపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications