ఏపీ టీచర్ల బదిలీల్లో సర్కార్ మరో ట్విస్ట్-వీరికి మాత్రం నో ఛాన్స్.. !
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు అర్హులైన వారు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం, వారిని బదిలీ చేయడం జరుగుతోంది. అయితే సర్కార్ తాజాగా ఇందులో మరో నిబంధన చేర్చింది. ఈ నిబంధన పరిధిలోకి వచ్చే టీచర్లను బదిలీలకు అనుమతించరాదని నిర్ణయం తీసుకుంది. దీంతో టీచర్ల బదిలీల ప్రక్రియలో ఇప్పుడు ఈ నిబంధన కలకలం రేపుతోంది.
అసలు విషయానికొస్తే గతేడాది పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. ఇందులో పలువురు ఉపాధ్యాయుల పాత్ర ఉన్నట్లు తేలింది. వీరిలో కొందరు వాట్సాప్ లో ప్రశ్నాపత్రాలు సర్కులేట్ చేయడం, మరికొందరు మాస్ కాపీయింగ్ కు ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. వీరిపై విచారణ నిర్వహించిన ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇలా క్రమశిక్షణా చర్యలకు గురైన టీచర్లను ఇప్పుడు బదిలీల కౌన్సిలింగ్ కు అనర్హులుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీరికి ఇచ్చిన నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి బదిలీల్లో చేరుస్తుంది. ఇప్పుడు ఈ నిబంధనల్లో క్రమశిక్షణా చర్యల నిబంధన చేర్చడంతో గతేడాది ఇలా చర్యలకు గురైన ఉపాధ్యాయలు ఎవరైనా ఉంటే వారు బదిలీలకు అనర్హులు అవుతారు.
ఈసారి రిక్వెస్ట్ బదిలీల కోసం మొత్తం 75 వేల మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తప్పనిసరి బదిలీల కోసం 32 వేల మంది దాకా దరఖాస్తు చేసుకున్నారు. టీచర్లకు 8 ఏళ్లు, హెచ్ఎంలకు ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే భార్యా లేదా భర్త తమ స్పౌజ్ పనిచేసే ప్రాంతాలకు దగ్గర్లో బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది. వీటిని ఉల్లంఘించి అక్రమంగా బదిలీకి దరఖాస్తు చేసుకుంటే మాత్రం క్రమశిక్షణా చర్యలతో పాటు మూడు ఇంక్రిమెంట్ల కోత పడబోతోంది.












Click it and Unblock the Notifications