ఏపీలో ఉచిత బస్సుతో పెను మార్పు..! పురుషుల డ్రాప్ ? సర్కార్ లెక్క ఇదే..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే ప్రకటించింది. వీటికి కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 9 వేల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ పథకం వల్ల పురుష ప్రయాణికులకు షాకులు తప్పవన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కల్పించనుండగా.. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైనర్లు, ఏసీ బస్సులు, నాన్ స్టాప్ లు, తిరుమల, శ్రీశైలం, పాడేరు ఘాట్ రోడ్డు బస్సుల్లో ఆ అవకాశం ఇవ్వడం లేదు. అయితే మహిళలకు ఇలా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల పురుషులపై తీవ్ర ప్రభావం పడేలా కనిపిస్తోంది.

ఆర్టీసీ లెక్కల ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణం అనుమతించడం వల్ల ఆయా బస్సుల్లో పురుష ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గబోతోంది. మహిళల ఉచిత ప్రయాణంతో రద్దీగా మారే బస్సుల్లో ప్రయాణించేందుకు పురుషులు మొగ్గు చూపుకపోవచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో వారి సంఖ్య 67 శాతానికి, పురుషుల సంఖ్య 33కు చేరుకుంటుందని అంచనా.

అలాగే పురుష ప్రయాణికుల ప్రయాణాలు తగ్గిపోవడం వల్ల ఆర్టీసీకి ఏడాదికి రూ.288 కోట్ల రాబడి తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మహిళా ప్రయాణికులకు ఛార్జీల రూపంలో 1453 కోట్లు భారం ప్రభుత్వంపై పడనుంది. అలాగే ఆర్టీసీకి నిర్వహణ ఖర్చులు మరో 200 కోట్లకు పైగా పెరగనున్నాయి. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీపై ఏడాదికి 1950 కోట్ల వరకూ భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఉచిత బస్సుపై పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications