30 సెకన్లలో 195 ముద్దులు.. గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన బ్రెజిల్ జంట
ప్రేమ.. హృదయాన్ని తాకే ఆ అందమైన అనుభూతి. మాటల్లో చెప్పకుండానే రెండు మనసులను కలిపే ఒక మధురమైన బంధమే లవ్. అటువంటి ప్రేమకు భాష లేదు, సరిహద్దు లేదు.. వయస్సు అనే తేడా ఉండదు. ప్రేమ అనేది ఒక ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రేమతోనే మనం ముందుకు వెళ్తాం. అందుకే ప్రేమకు దేశాలు, భాషలు, సంస్కృతి, ఖండాలే అడ్డుకావని అంటుంటారు. అయితే ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలుంటాయి. అయితే బ్రెజిల్‌కు చెందిన ఓ జంట మాత్రం తమ ప్రేమ ముద్దుల రూపంలో బయటపెట్టి ప్రపంచ రికార్డు సాధించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్..
బ్రెజిల్‌కు చెందిన రెనాటో బేమా గియా.. అతని ప్రియురాలు నయారా రాబర్టా రిబీరో డి మారిన్స్.. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం సందర్భంగా అరుదైన ఘనత సాధించారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో 195 ముద్దులు పెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరూ డాక్టర్లు అని.. ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియోలో.. రెనాటో తన అభిమాన ఫుట్‌బాల్ జట్టు జెర్సీ ధరించి, నయారా చెంపపై వేగంగా ముద్దులు పెడుతున్నారు. అందుకు గాను ఆమె చిరునవ్వుతో నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. కాగా రెనాటో ఇప్పటికే పలు గిన్నిస్ రికార్డులను సాధించనట్టు సమాచారం.
గత రికార్డులు..
వేగంగా 10 పుస్తకాలను వరుసలో పెట్టి పడగొట్టడం
పాదాన్ని అత్యధికంగా తిప్పడం (పురుషుల విభాగంలో)
ఇప్పుడు ఈ రికార్డుతో బ్రెజిల్‌లో అత్యధిక ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తిగా తాను నిలిచానని రెనాటో తెలిపారు. అంతే కాకుండా ఈ జంట నిమిషంలో అత్యధిక ముద్దుల రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు సైతం సిద్ధమవుతోంది. ప్రస్తుతం జపాన్‌కు చెందిన చెర్రీ యోషితాకే, కుమికో షిరటోరి పేరిట 277 ముద్దులతో ఈ రికార్డు ఉంది.












Click it and Unblock the Notifications