అమరావతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమ..!!
ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు బకాయిలు విడుదల చేసింది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ నేరుగా వారి ఖాతాల్లోజమ చేయనుంది.ఇందు కోసం ప్రభుత్వం రూ 400 కోట్లను విడుదలకు ఆమోద ముద్ర వేసింది.అదే సమయంలో హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది.
అమరావతిలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో పెండింగ్ అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. భూసమీకరణ పెండింగ్ లో ఉన్న గ్రామాల్లో రైతులతో నేరుగా మంత్రి నారాయణ సంప్రదింపులు చేస్తున్నారు. వారిని భూములు ఇచ్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భూములు ఇస్తే కోరిన చోట ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇస్తున్నారు.

ఇక, అమరావతిలో నిర్మాణాల పైన అధ్యయనం చేసిన చెన్నై ఐఐటీ నిపుణుల బృందాలు ప్రాథమిక నివేదికను అందజేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో తుది నివేదికను అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో మరోవైపు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలింది. ఐదేళ్లుగా నీళ్లలో ఉంటూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న నివాస భవనాల టవర్ల పటిష్ఠతపై చెన్నై, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు ఆర్కిటెక్చరల్ డిజైన్లు, సేవలు అందజేసేందుకు సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. వచ్చే నెల 4 మధ్యాహ్నం 2 గంటలలోపు బిడ్‌లు దాఖలు చేయాలని సూచించింది ప్రభుత్వం. వచ్చే నెల 4న సాయంత్రం టెక్నికల్ బిడ్‌లు ఓపెన్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.












Click it and Unblock the Notifications