ఇటు వంశీ.. అటు పోసాని.. వరుస షాక్ లతో ఉక్కిరిబిక్కిరి..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తనపై ఫిర్యాదుదారును కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన వల్లభనేని వంశీతో పాటు చంద్రబాబు, పవన్ ను ఇష్టారాజ్యంగా దూషించిన పోసాని కృష్ణమురళిపై వరుస కేసులు, కస్టడీ పిటిషన్లు, పీటీ వారెంట్లతో ప్రభుత్వం విరుచుకుపడుతోంది. దీంతో వీరు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
తాజాగా అరెస్టు చేసిన పోసాని కృష్ణమురళిని తొలుత రాజంపేట జైలుకు తరలించి ఆ తర్వాత పీటీ వారెంట్ పై నరసరావుపేటకు తెచ్చి అక్కడ జైలుకు పంపిన పోలీసులు.. ఇప్పుడు కర్నూలుకు తెచ్చి అక్కడ జైల్లో పెట్టారు. అంతటితో ఆగకుండా పోసానిని మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఆదోని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో నరసరావుపేట, అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా ఇలాగే కస్టడీ పిటిషన్లు వేశారు. దీంతో కోర్టులు సైతం పోసానిని ఎవరికి అప్పగించాలో తెలియక గందరగోళపడుతున్న పరిస్ధితి కనిపిస్తోంది.

మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అంతకుముందు అరెస్టు అయిన వల్లభనేని వంశీకి సైతం పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. వంశీని ఈ కేసులో విచారణ కోసం ఏకంగా 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నప్పుడు వంశీ నోరు విప్పలేదని, అందుకే ఈసారి 10 రోజుల పాటు విచారిస్తామంటూ పిటిషన్ వేశారు. వంశీ ఫోన్లు ఎక్కడున్నాయో ఇంకా తెలియలేదని, అలాగే ఈ కేసులో మరో ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉందని, వారి సమాచారం వంశీ నుంచే రాబట్టాల్సి ఉందని తెలిపారు. దీనిపై విజయవాడ కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications