ఏపీలో 55 మంది సీనియర్ డాక్టర్లకు షాక్-సర్వీస్ నుంచి తొలగింపు..!
ఏపీలో పని చేయని సీనియర్ డాక్టర్లకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. సీనియర్ డాక్టర్లుగా ఉంటూ వివిధ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. డ్యూటీకి రాకుండా ప్రైవేటు ఆస్పత్రులు పెట్టుకుని లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసుకుంటున్న వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే వీరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.
రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రతిష్టాత్మక ఆస్పత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో డాక్టర్లు పనిచేయాల్సిన వారు విధులకు హాజరు కావడం లేదంటూ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని 2023లో ఆయన దాఖలు చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త విచారణ జరిపింది. అనంతరం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.

లోకాయుక్త ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో సీనియర్ డాక్టర్లుగా ఉన్న 55 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లను విధుల నుంచి తొలగిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో పాటు వీరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. లోకాయుక్త ఆదేశాలతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక పంపింది. వీరంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ సుదీర్ఘ కాలంగా విధులకు హాజరుకాకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని నిబంధనల ప్రకారం తొలగిస్తున్నారు.












Click it and Unblock the Notifications